Skin Care Tips for Winter : చలికాలంలో మన శరీరంలో మొదట దెబ్బతినేది చర్మమే. ఈ సీజన్లో పొడిగాలుల దెబ్బకు వేడి, తేమ ఇట్టే ఎగిరిపోతుంది. దీనివల్ల చర్మం పొడిబారుతుంది. ఫలితంగా చర్మంపై పగుళ్లు రావడం, దురద తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. అయితే, కొంతమందిలో ఇటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా ఊడుతుంటుంది. చర్మం పొట్టు మందంగా పొరలుగా రాలుతూ విపరీతమైన మంట పుడుతుంది. దీంతో చాలా మంది కొబ్బరి నూనె, జెల్లీలు రాసుకుని తాత్కాలిక ఉపశమనం పొందుతారు. అయితే ఇలా చేతులు, పాదాలపై చర్మం పొట్టు మందమైన పొరలుగా రాలిపోవడానికి గల కారణాలు ఏంటి ? దీనిని ఎలా తగ్గించుకోవాలి ? అనే ప్రశ్నలకు ప్రముఖ కాస్మెటాలజిస్టు డాక్టర్ శైలజ సూరపనేని సమాధానం ఇస్తున్నారు. ఆ వివరాలు మీ కోసం.
ఇన్‌ఫెక్షన్ కారణంగా!
చర్మం పొట్టులా ఊడడడానికి కొన్ని రకాల ఇన్‌ఫెక్షన్లు, మందులు పడకపోవడం, ఎగ్జిమా, వాతావరణంలో తేమ తగ్గడం, హైపర్ థైరాయిడిజం, హైపర్ హైడ్రోసిస్ వంటివి ప్రధాన కారణాలు. సాధారణంగా తరచూ మాయిశ్చరైజర్ రాసుకుంటే సమస్య తగ్గుతుంది. కానీ మందంగా చర్మం ఊడిపోవడమనేది ఒక పెద్ద సమస్యగా గుర్తించాలి. దీనికి ఫంగల్ ఇన్‌ఫెక్షన్ అయిన అథ్లెట్‌ఫుట్ కారణం కావచ్చు. ఈ ఇన్‌ఫెక్షన్ మొదట పాదాల వేళ్ల నుంచి మొదలై పాదమంతా పాకుతుంది. దీనివల్ల అక్కడ చర్మం ఎర్రబడటం, దురద, నీటి బుడగలు వంటివి వస్తాయి. ఫంగల్ ఇన్‌ఫెక్షన్ ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. ఎక్కువగా టవళ్లు, సాక్సులు పంచుకోవడం వల్ల వస్తుంది. యాంటీఫంగల్ క్రీములు వాడడం వల్ల ఫంగల్ ఇన్‌ఫెక్షన్ తగ్గే అవకాశం ఉంటుందని డాక్టర్ శైలజ సూరపనేని చెబుతున్నారు.
"ఒకవేళ ఫంగల్ ఇన్‌ఫెక్షన్ తగ్గకపోతే ఓరల్ యాంటీబయాటిక్స్ తీసుకోవాలి. బాగా పొడిచర్మం ఉన్నా ఇలా చర్మం పొట్టు రాలుతుంది. ఫలితంగా దురద, మంట ఇబ్బంది పెడతాయి. బాగా వేడినీటి స్నానాలు చేయడం, సరిగా నీళ్లు తాగకపోవడం, ఎండలో ఎక్కువసేపు గడపడం, ఒత్తిడి వంటి కారణాల వల్ల కూడా పొట్టు రాలుతుంది. ఎగ్జిమా అయితే వంశపారంపర్యంగా వస్తుంది. ఇది మన బాడీలో ఎక్కడైనా రావొచ్చు. ఎగ్జిమాతో బాధపడేవారు హైడ్రోకార్టిజాన్, యాంటీ హిస్టమిన్ లాంటి క్రీములు వాడాలి." - డాక్టర్ శైలజ సూరపనేని (కాస్మెటాలజిస్టు)
ప్లామో పాంథర్ సొరియాసిస్ కారణంగా కూడా చర్మం బాగా పొట్టులా రాలడం, దురద, రక్తం కారడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇంకా చలి, ఒత్తిడి కారణంగా ఈ సమస్య అధికమవుతుంది. ఈ సమస్యతో బాధపడేవారు మాయిశ్చరైజింగ్, స్టెరాయిడ్ క్రీములు వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ప్రాబ్లమ్ విపరీతంగా ఉంటే ఫొటోథెరపీ చేయించుకోవాలి.
కొన్ని జాగ్రత్తలు :
చలికాలంలో చర్మం పొడిబారే వారు కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల సమస్యని తగ్గించుకోవచ్చు. ఈ క్రమంలో పరిమళాలు ఉండే సబ్బులకు దూరంగా ఉండాలి. అలాగే తరచూ కాళ్లూ, చేతులు కడగడం వంటివి మానేయాలి. ఇంకా మినరల్ ఆయిల్స్, షియాబటర్, లెనోలిన్, గ్లిజరిన్, హైలురోనిక్ యాసిడ్ ఉన్న క్రీములు తరచూ రాయాలి. వీలైతే హ్యుమిడిఫయర్ గదిలో ఉంచుకోవాలి. కాళ్లు, చేతులకు సాక్సులు, గ్లవుజులు ధరించాలి. ఈ జాగ్రత్తలన్నీ పాటించినా కూడా సమస్య అదుపులోకి రాకపోతే నిపుణులను సంప్రదించాలని డాక్టర్ శైలజ సూరపనేని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
షుగర్ ఉన్నవారు మటన్ తినచ్చా? - నిపుణుల కీలక సమాధానం ఇదే!
మూత్రంలో రక్తం పడితే క్యాన్సర్ వచ్చినట్లేనా? డాక్టర్లు ఏం అంటున్నారంటే?