Illegal Sand Mining in Anantapur District : అక్కడ ఇసుక దందా అంతా బహిరంగ రహస్యమే. ప్రొక్లైనర్లు, టిప్పర్లకు పగటి పూట విశ్రాంతి ఇస్తారు. చీకటి పడగానే తోడేస్తారు, తరలిస్తారు. అన్నీ తెలిసినా అధికారులు ఆపలేకపోతున్నారు. అడ్డుకోలేకపోతున్నారు. మూడు టిప్పర్లు, ఆరు ట్రాక్టర్లుగా ఇసుక అక్రమ రవాణా సాగిపోతోంది.
ఇదీ అనంతపురం జిల్లా పామిడి సమీపంలోని పెన్నానదీ తీరంలో ఇసుక అక్రమ రవాణా తీరు. పేదల కోసం తెచ్చిన ఉచిత ఇసుకను వక్రమార్గంలో సొమ్ము చేసుకుంటున్నారు. సొంత ఇంటి నిర్మాణం ముసుగులో ఇసుకను పగటిపూట ట్రాక్టర్లతో తరలిస్తారు. దాన్ని ఓ రహస్య ప్రదేశంలో డంప్ చేస్తారు.
రాత్రిపూట అదే డంప్ నుంచి టిప్పర్లతో, కావాల్సిన వారికి, కావాల్సిన చోటకు తరలించుకెళ్తారు. పెన్నా పరివాహకంలోని పట్టాభూముల్లోనూ పంటలు తొలగించేసి ఇసుక తోడేసుకుంటున్నారు. కొందరు రైతులు తమ పొలాలకు వెళ్లే మార్గంలో గేట్లు పెట్టి తాళాలు వేసుకోవాల్సి వస్తోంది. ఇంకొందరైతే రాత్రిళ్లు గస్తీ కాస్తున్నారు.
అనధికార రీచ్‌ల్లోకి వరుసకడుతున్న ట్రాక్టర్లు- అప్పుడూ ఇప్పుడూ అదే దందా!
ఇసుక తోడే యంత్రాలను పగలంతా పెన్నానదిలోనే చెట్ల పొదల మధ్య దాచిపెట్టి, రాత్రిళ్లు రంగంలోకి దించుతున్నారు. నీటి ప్రవాహం ఉన్నచోటే భారీ గోతులు తవ్వుతున్నారు. ఇటీవల అర్థరాత్రి నదిలో, ఓ టిప్పర్ గోతిలో పడి ఇంజన్ ఆయిల్ లీకైంది. టిప్పర్‌ను ఎలాగోలా రీచ్ దాటించినా జాతీయ రహదారిపైకి చేరగానే ఆగిపోయింది. రెవెన్యూ అధికారులు టిప్పర్‌కు 40 వేల రూపాయలు జరిమానా వేసి చేతులు దులుపుకున్నారే తప్ప అక్రమ దందా మూలాల జోలికెళ్లలేదు.
'పగలు ట్రాక్టర్లు దాచేస్తారు. రాత్రి అవగానే ఇసుక దోచుకుపోతున్నారు. పంటలు కాపాడుకోవడానికి చాలా కష్టపడుతున్నాం. దాదాపు 15 అడుగుల లోతుకు తవ్వి ఇసుక దోచుకుంటున్నారు. ఈ గోతుల్లో వాహనాలు పడిపోయి ప్రమాదాలు తలెత్తుతున్నాయి. అధికారులు వెంటనే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.' -స్థానిక రైతులు
ఇటువంటి దందాల్ని రెవెన్యూ, పోలీసు అధికారులు మండల స్థాయి బృందంగా ఏర్పడి. ఇసుక అక్రమ తవ్వకాలు అడ్డుకోవాలి. గతేడాది జులై 8న ప్రభుత్వం జీఓ నంబర్ 43 రూపంలో ఆ మేరకు విస్పష్ట ఆదేశాలిచ్చింది. కానీ, ఏ ఒక్క అధికారీ పామిడిలోని పెన్నా పరివాహకం వైపు కన్నెత్తి చూడరు.