Two Arrested In Alaknanda Kidney Racket Case :సరూర్ నగర్‌లోని అలకనంద ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి ఘటన తీవ్ర కలకలం రేపింది. దీంతో అప్రమత్తమైన వైద్యారోగ్యశాఖ విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. మరింత లోతుగా విచారించేందుకు కేసును సీఐడీకి అప్పగించాలంటూ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు త్వరలోనే కేసు దర్యాప్తును సీఐడీ మొదలుపెట్టనుంది. సీఐడీకి వైద్యారోగ్యశాఖ అధికారులు ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించాలని మంత్రి సూచించారు.
కస్టడీ కోరే అవకాశం :డిప్యూటీ డీఎంహెచ్ఓ గీతా ఫిర్యాదు కేసు నమోదు చేసిన పోలీసులు 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఆస్పత్రి ఛైర్మన్ సుమంత్, మధ్యవర్తి గోపీతో పాటు మరో ఆరుగురు ఉన్నారు. వీరి నుంచి మరికొందరి ఫోన్ నంబర్లు, వివరాలు సేకరించి ఘటన వెనుక ఎంత మంది ప్రమేయం ఉందనే కోణంలో కూపీలాగుతున్నారు. పోలీసులు అదుపులో ఉన్న సుమంత్, గోపీలను అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. రిమాండ్‌లో ఉన్న వీరిద్దరినీ పోలీసులు త్వరలోనే కస్టడీకి కోరే అవకాశం ఉన్నట్లు సమాచారం. సుమంత్‌తో పాటు గోపీ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.
దర్యాప్తు ముమ్మరం :ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని హైదరాబాద్ తీసుకొచ్చి కిడ్నీ మార్పిడి చికిత్సలు చేయడం పట్ల ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. నగరంలో ఇలా ఇంకెన్ని చోట్ల ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు. ఎంతమంది డాక్టర్ల ప్రమేయం ఉంది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనపై శనివారం రాచకొండ సీపీ వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.