TTD PARAKAMANI GOLD COIN THEFT CASE : తిరుమల శ్రీవారి ఆలయ పరకామణి బంగారు బిస్కెట్ దొంగతనంలో కేసు కొత్త మలుపు తిరిగింది. జనవరి 11వ తేదీన తిరుపతికి చెందిన వీరిశెట్టి పెంచులయ్య పరకామణి భవనంలో బంగారు చోరీ ఘటనలో పట్టుబడ్డారు. అతడిని విచారించగా మరిన్ని కీలక విషయాలు తెలిశాయి. ఇప్పటి వరకూ అతడు బంగారు నిల్వ ఉంచే గది నుంచి సుమారు 46 లక్షల విలువ గల బంగారు బిస్కెట్స్‌ను చోరీ చేసినట్లు తేలింది.
ఈ కేసులో పెంచలయ్యను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. 100 గ్రాముల బంగారు బిస్కెట్ తో పాటు గతంలో మరో 555 గ్రాముల బంగారు బిస్కెట్స్, 100 గ్రాముల ఆభరణాలు, 157 గ్రాముల వెండిని దొంగలించినట్లు పోలీసులు కనుగొన్నారు. కాగా ఈ చోరిలో నిందితుడు పెంచలయ్య 100 గ్రాముల బంగారు బిస్కెట్‌ను ట్రాలీకి ఉన్న పైపులలో ఉంచారు. తనిఖీల్లో భాగంగా టీటీడీ భద్రతా అధికారులు బంగారు బిస్కెట్‌ను గుర్తించారు. బంగారు బిస్కెట్‌ను చూసిన భద్రత సిబ్బంది అది ట్రాలీలోకి ఎలా వచ్చిందనే అనుమానంతో పైఅధికారులకు సమాచారం అందజేశారు.
ఈ ఘటనపై విచారణ చేపట్టిన టీటీడీ విజిలెన్స్ అధికారులు బంగారు బిస్కెట్‌ను దొంగలించింది యూనియన్ బ్యాంక్ కాంట్రాక్టు ఉద్యోగి పెంచలయ్యగా సీసీ కెమెరా ద్వారా రెండు గంటల్లో గుర్తించారు. తిరుపతికి చెందిన వీరిశెట్టి పెంచలయ్య తిరుమల శ్రీవారి పరకామణిలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా గత రెండు సంవత్సరాల నుంచి పని చేస్తున్నాడు. ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో పరకామణిలోని బంగారం నిల్వ ఉంచే గదిలోని గోల్డ్ వస్తువులను దొంగిలించినడం మొదలు పెట్టాడు.