452 Dishes for Son In Law in Eluru District : గోదారోళ్లు అంటే ఆతిథ్యానికి మారుపేరు. ప్రతి మాట చివర సాగదీత అందులో వెటకారం కలబోత కానీ మమకారం మాత్రం కుండపోత. అందులోనూ పండగ వచ్చిందంటే చాలు ఇంటికి వచ్చే అతిథులకు రకరకాల వంటలతో వడ్డించి మర్యాదలతో ముంచెత్తుతారు. బంధువులకు రకరకాల వెరైటీలతో కడుపు నింపేదాకా ఊరుకోరు. ఇక కొత్త అల్లుళ్లకు అయితే ఆ మర్యాదల గురించి చెప్పనక్కర్లేదు. కొత్త బట్టలు, పిండి వంటలు అవీ ఇవీ అని ఆ హడావుడే చెప్పనక్కర్లేదు.
తాజాగా ఏలూరు జిల్లా అత్తింటి వారు కొత్త అల్లుడికి కలకాలం గుర్తుండేలా పసందైన విందు ఇచ్చారు. తొలిసారిగా ఇంటికి వచ్చిన అతనికి సుమారు 452 రకాల వంటలు వడ్డించారు. అత్తింటివారి మర్యాదలు చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు అల్లుడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జంగారెడ్డిగూడెంకి చెందిన వందనపు వెంకటేశ్వరరావు దంపతుల కుమార్తెను కొయ్యలగూడెంకు చెందిన కొల్లూరి శివ భాస్కర్‌కి ఇచ్చి వివాహం జరిపించారు.
Sankranti Celebrations 2025 in AP : కొత్త అల్లుడిని మొదటి సంక్రాంతి పండగకు ఆహ్వానించి ప్రత్యేక విందును ఏర్పాటు చేసి ఆశ్చర్యపరిచారు. శాకాహారం, పిండి వంటలు, స్వీట్లు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, శీతల పానీయాలు ఇలా 452 రకాలు చిన్న చిన్న కప్పులలో ఉంచి వాటిని అందంగా అలంకరించి అల్లుడు, కుమార్తెను విందుకు ఆహ్వానించారు. ఈ మెగా విందులో వంటకాలు చూసి అల్లుడు శివ భాస్కర్ ఆశ్చర్యానికి లోనయ్యారు. అత్తవారింట్లో ఏర్పాటు చేసిన అపురూప విందును ఊహించలేదని తెలిపారు. శాకాహారంలో ఇన్ని రకాల ఐటమ్స్ ఉంటాయని ఇప్పుడే చూశానని వివరించారు.
కుమార్తె, అల్లుడు వాటిని ఒకరినొకరు తినిపించుకుంటుంటే వందనపు వెంకటేశ్వరరావు దంపతులు సంబరపడ్డారు. అల్లుళ్లకు సంప్రదాయాల, మర్యాదలు రుచి చూపించడంలో గోదారోళ్లు ముందుంటారని వెంకటేశ్వరరావు తెలిపారు. ఇప్పుడు 452 రకాల వంటకాలతో ఆతిథ్యం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అయితే అల్లుడికి ప్రేమతో వడ్డించిన వంటకాలు చూసిన కొందరు యువకులు మాకు కూడా ఇలాంటి అత్తింటివారు వస్తే ఎంత బాగుంటుందో అని సరదాగా చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
నెల్లూరు మామా..! మజాకా..! 108 రకాల వంటలతో అల్లుడికి విందు
గోదారోళ్లా మజకా - 100 రకాల వంటలతో విందు - అవాక్కైన అల్లుడు - 100 Types of Dishes For Son In Law