Twins Participate AI Global Summit : సాధారణంగా 14 ఏళ్ల వయసు అంటే స్కూల్కెళ్లి చదువుకుని, ఇంటికి రాగానే వచ్చి స్నేహితులతో ఆడుకుంటాము. లేకపోతే టీవీ చూస్తూ హోమ్ వర్క్ చేసుకొని హాయిగా నిద్రపోతాం. కానీ ఈ ఇద్దరు కవలలు మాత్రం సొంతంగా రెండు కంపెనీలు ఏర్పాటు చేసి అందరి చేతా ఔరా అనిపించుకుంటున్నారు. వారి వయసుకు మించిన ఆలోచనల జోరుతో ముందుకు సాగుతున్నారు. వీరు పుట్టింది హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో అయినా, ఇప్పుడు పెరుగుతుంది మాత్రం అమెరికాలో.
ఇంత వయసులోనే కృత్రిమ మేధ (ఏఐ)లో ప్రావీణ్యం సంపాదించుకున్నారు. వారే సిద్ధార్థ్ నంద్యాల, సౌమ్య నంద్యాల. గురువారం నుంచి హైదరాబాద్‌లో జరుగుతున్న గ్లోబల్ ఏఐ సదస్సులో అమెరికా నుంచి వచ్చి పాల్గొన్నారు. వీరి ఆలోచనలు చూసి గ్లోబల్ సమ్మిట్‌కు వచ్చిన వారు సైతం అవాక్కవుతున్నారు.
ప్రపంచంలోనే చిన్నవయసులో ఏఐ సర్టిఫైడ్ : కవలల్లో ఒకరైనా సిద్ధార్థ్‌కు ఏడేళ్ల వయసులోనే కోడింగ్‌పై ఆసక్తి పెరిగింది. సామాజిక మాధ్యమాల్లోని లింక్డిన్ లెర్నింగ్, యూట్యూబ్‌లో చూసి సీ, సీ++, పైథాన్ లాంగ్వేజెస్ నేర్చుకున్నాడు. ఒరాకిల్, ఆర్మ్ నుంచి మిషిన్ లెర్నింగ్, ఏఐపై ప్రావీణ్యం సంపాదించుకున్నాడు. దీంతో ప్రపంచంలోనే అతిచిన్న వయసులో ఏఐ సర్టిఫైడ్ అయ్యాడు. ఈ క్రమంలోనే ఏడో తరగతిలోనే డల్లాస్ సమీపంలోని ప్రిస్కో నగరంలో స్టెమ్ ఐటీ కంపెనీని స్థాపించాడు. పలు ఏఐ ఆధారిత ఉత్పత్తులను స్వయంగా ఆల్గరిథమ్లు రాస్తూ రూపొందించాడు. అందులోనే వృద్ధుల కోసం చేసిన ఫాల్ డిటెక్షన్ బ్యాండ్, ఏఐతో పనిచేసే ప్రోస్థటిక్ హ్యాండ్ ప్రాచుర్యం పొందాయి.
ఏఐ ప్రోస్థటిక్ హ్యాండ్ : చేతులు లేనివారికి అమర్చేందుకు తక్కువ ఖర్చుతో దీన్ని రూపొందించాడు. దీన్ని ఏఐ సదస్సులో ప్రదర్శించనున్నాడు. అనంతరం వివరించనున్నాడు.