Twins Death in an Accident at Jeedimetla Industrial Area : వారిద్దరూ కవలలు. బతుకుదెరువు కోసం పక్క రాష్ట్రం ఏపీ నుంచి తెలంగాణకు వచ్చారు. కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అంతా బాగానే ఉందనుకునేలోపు ఓ ఘటన వారి జీవితాలను చిదిమేసింది. రసాయనాల ట్యాంకులో పడి కవలలిద్దరూ దుర్మరణం చెందారు. ఈ ఘటన హైదరాబాద్ శివారు జీడిమెట్ల పారిశ్రామికవాడలో బుధవారం జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఏపీలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోణ మండలం దొంతికూరకు చెందిన రామ్‌లక్ష్మణ్‌లు కవలలు. వారు ఉపాధి కోసం హైదరాబాద్ నగరానికి వచ్చారు. శివారు ప్రాంతంలోని గుండ్లపోచంపల్లిలో ఉంటూ కూలీలుగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని మూతపడ్డ సాబూరి ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో ఫ్యాబ్రికేషన్ పనులు జరుగుతున్నాయి. ఈ పనులను కవలలతో గుత్తేదారు సాదు నారాయణరావు చేయిస్తున్నారు.
రోజువారీగానే బుధవారం ఉదయం కవలలిద్దరూ కంపెనీకి వెళ్లారు. అక్కడ ఓ షెడ్డుకు ఉన్న పైపులను తొలగించే పనులను చేస్తున్నారు. ఈ క్రమంలో రామ్ అదుపు తప్పి కింద ఉన్న ప్రమాదకర రసాయనాల నిల్వలో పడిపోయాడు. అతను ఆ ట్యాంకులో ఉన్న రసాయనాలను మింగి ఉక్కిరిబిక్కిరవ్వడం చూసిన లక్ష్మణ్ అందులో దిగాడు. రామ్‌ను కాపాడే క్రమంలో లక్ష్మణ్ నోట్లోకి కొంత రసాయనం వెళ్లింది. స్పృహ కోల్పోయిన రామ్‌ను లక్ష్మణ్ బయటకు తీసుకొచ్చాడు. వెంటనే నోటి నుంచి నురగలు కక్కుకుంటూ లక్ష్మణ్ అక్కడే పడిపోయాడు.