Tualsi success story :శక్తికి మించి చదివించిన తల్లిదండ్రుల కష్టాలను కళ్లారా చూసిందీ విద్యా కుసుమం. అందుకోసం ఆహర్నిశలు చదివింది. ప్రాథమిక విద్యాభ్యాసం మొదలుకొని ఎమ్‌టెక్(M.Tech) దాకా మంచి మార్కులు తెచ్చుకుని ఉచితంగా చదువుకుంది. ఆర్థిక ఇబ్బందుల నడుమ ట్యాషన్లు చెబుతూ వచ్చిన డబ్బులతో పోటీ పరీక్షలకు సన్నద్ధమైంది. పట్టుదలతో చదివి 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి, తల్లిదండ్రుల కలలను నిజం చేసింది.
నల్గొండకు వలస :పుస్తకాలతో కుస్తీ పడుతున్న ఈ యువతి పేరు చింతల తులసి. నల్గొండ జిల్లా కల్మెర గ్రామానికి చెందిన వెంకన్న, లక్ష్మి దంపతుల చిన్న కుమార్తె. గ్రామంలోని ఎకర పొలంలో పంటలు సరిగ్గా పండకపోవడంతో, వెంకన్న తన కుంటుబాన్ని తీసుకుని నల్గొండ పట్టాణానికి వలసొచ్చారు. అక్కడే లాండ్రీషాపు నడుపుతూ వచ్చిన డబ్బుతోనే పిల్లలను చదివించారు. బాల్యం నుంచి తల్లిదండ్రుల పడే కష్టాలను చూసిన తులసి ఎలాగైనా అందులోంచి వారిని బయటపడేయాలని భావించింది.
పోటీ పరీక్షలకు సన్నద్ధం : అందుకు చదువొక్కటే మార్గమని అనుకుంది. రేయింబవళ్లు శ్రమించి పదో తరగతిలో 9.8 జీపీఏ తెచ్చుకుని భవిష్యత్తుకు పునాది బాటలు వేసుకుంది. ఇంటర్‌లోనూ మంచి మార్కులు సాధించిన తులసి, జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో ఉచితంగా బీటెక్ (B.tech) చదివింది. అనంతరం గేట్ ప్రవేశపరీక్ష రాయగా విజయవాడలోని ఓ ప్రైవేటు కాలేజీలో సీటొచ్చింది. కానీ, డబ్బులు లేక అందులో చేరలేదు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీలో ఎమ్‌టెక్ (M.tech) పూర్తిచేసింది. ఆ సమయంలోనే పోటీ పరీక్షలకు సన్నద్ధమవ్వడం ప్రారంభించింది.
ఎమ్‌టెక్ చదివేటప్పుడు వచ్చిన ఉపకార వేతనంతో పాటు ట్యూషన్లు చెప్పగా వచ్చిన డబ్బులతోనే పరీక్ష ఫీజులను చెల్లించినట్లు తులసి చెబుతోంది. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా 2 సంవత్సరాలు కష్టపడి చదివినట్లు వివరిస్తోంది. ఇటీవల విడుదలైన గ్రూప్- 4 సహా పాలిటెక్నిక్ లెక్చరర్, ఏఈఈ, ఏఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లు చెబుతోందీ సరస్వతీ పుత్రిక.