TTD EO Visits Tirupati SVIMS Hospital: తిరుపతిలో వైకుంఠద్వార దర్శన టోకెన్ల జారీ కేంద్రం వద్ద తొక్కిసలాటలో ఆస్వస్థతకు గురైన భక్తులను టీటీడీ ఈవో పరామర్శించారు. తిరుపతి స్విమ్స్ ఆస్పత్రికి వెళ్లిన టీటీడీ ఈవో శ్యామలరావు చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. క్షతగాత్రుల పరిస్థితి గురించి వైద్యులతో మాట్లాడారు.
విచారణ తర్వాత పూర్తి వివరాలు:తొక్కిసలాట ఘటనకు కారణాలపై విచారణ జరుగుతోందని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. డీఎస్పీ గేట్లు తెరవడం వల్లే ఘటన జరిగినట్లు ప్రాథమికంగా తెలిసిందని అన్నారు. విచారణ తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పారు. తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని, క్షతగాత్రులు రుయా, స్విమ్స్‌లో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. ఇద్దరికి మాత్రమే తీవ్రగాయాలయ్యాయని, చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. మిగతా వారిని త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని అన్నారు.
తిరుపతి టోకెన్ల జారీ కేంద్రం వద్ద బుధవారం రాత్రి తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. వైకుంఠద్వార దర్శనానికి టోకెన్ల జారీ కేంద్రాల వద్దకి ఒక్కసారిగా భక్తులు పోటెత్తడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. బైరాగిపట్టెడ టోకెన్ల జారీ కేంద్రం వద్ద భక్తుల మధ్య తోపులాట జరిగింది. తోపులాట ఘటనలో 48 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరికి రుయా, స్విమ్స్ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.