Sankranti Kodi Pandelu in AP : ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి వేళ బరుల్లో కాలు దువ్వేందుకు కోడి పుంజులు సిద్ధమయ్యాయి. ఏటా కోట్లలో చేతులు మారే ఈ పందేల కోసం శ్రద్ధ తీసుకుని మరీ పుంజులను పెంచుతారు. ప్రత్యేక ఆహారం, శిక్షణ సరేసరి. పోలీసుల హెచ్చరికలు ఉన్నా సంక్రాంతి అంటే కోడిపందాలే అనేలా ఈసారీ పుంజులను పెంపకందారులు సిద్ధం చేశారు.
సంక్రాంతి అంటే ముందుగా గుర్తొచ్చేవి గోదావరి జిల్లాలే. ముఖ్యంగా కోడి పందేల హడావుడే ఎక్కువ. అందుకే డిమాండ్ దృష్ట్యా పందెం కోళ్ల పెంపకం ఏటికేడు పెరుగుతూ వస్తోంది. స్థానికుల కన్నా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారే ఎక్కువగా పందేల్లో పాల్గొనడం, వేలు, లక్షల్లో పందేలు వేస్తుండటంతో పండుగ రోజుల్లో వందల కోట్ల రూపాయలు చేతులు మారతాయి. దీంతో పందేల్లో ప్రధానమైన కోడి పుంజులను ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మరీ పెంచుతున్నారు.
కోడిపందేలు, రికార్డింగ్ డాన్సులు - ఎక్కడెక్కడ ఏమేం స్పెషల్ అంటే!
400కి పైగా కోడి పుంజుల కేంద్రాలు: ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలో దాదాపు 400కి పైగా కోడి పుంజుల పెంపకం కేంద్రాలు ఉన్నాయంటే పందేలు ఏ స్థాయిలో జరుగుతాయో ఊహించుకోవచ్చు. ఆయిల్ పామ్ తోటలు మొదలు, చెరువు గట్లు, పొలాల్లో కోళ్ల పెంపకాలు భారీ ఎత్తున జరుగుతున్నాయి. పందెం రాయుళ్లు పెంపకందారులతో ముందుగానే ఒప్పందం చేసుకుని మరీ ప్రత్యేకంగా కోళ్లను పెంచుతుండగా ఇప్పటికే ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి పందెం రాయుళ్లు కోళ్ల కొనుగోళ్ల చేసే ప్రక్రియను ముమ్మరం చేశారు. పోరాటం చేసే విధానం, పుంజు రంగు, ఎత్తు, పుంజు బ్రీడ్‌ను బట్టి ఒక్కో పుంజు ధర రూ.25 వేల నుంచి 3 లక్షల వరకు పలుకుతోంది. పండుగ రోజుల్లో వీటి అమ్మకాల రూపంలోనే దాదాపు రూ.25 కోట్ల వ్యాపారం జరుగుతుందని సమాచారం.
కోడి పందేలు చూసే వారికి వినోదం కల్పించినా వీటి పెంపకం వెనుక మాత్రం చాలా కష్టం దాగుంది. కోడి పిల్లను పొదిగిన తర్వాత దాన్ని వేరు చేసి బరిలో దిగి అవతలి కోడిపై బలంగా పోరాడే వరకూ పెంచి, తర్ఫీదునివ్వడానికి ఒక యజ్ఞమే చేయాలి. నెమలి, అబ్బరాసు, పింగళ, పర్ల, మైల, డేగ, పచ్చకాకి, కొక్కిరాయి, తీతువ ఇలా పలు జాతులకు చెందిన కోళ్లను పందేలకు సిద్ధం చేస్తారు. నిత్యం ఉడకబెట్టిన గుడ్లు, బాదం, మటన్ ఖీమా, జీడిపప్పు, రాగులు, సజ్జలు, ఎండు ఫలాల లడ్డూ ఇలా బలవర్థకమైన ఆహారం పెట్టి వీటిని పెంచుతారు. చురుగ్గా పోరాటం చేసేలా ఈ మేతను తినిపిస్తుంటారు.
ఊపందుకున్న కోడి పందేలు - చేతులు మారుతున్న కోట్ల రూపాయలు
బరిలో దిగిన కోడి ప్రత్యర్థి పుంజుపై విజయం సాధించేలా కోళ్లను బలంగా తయారు చేస్తారు. ఇందుకోసం కోడితో వ్యాయామాలు చేయించడం, ఈత కొట్టించడం, నొప్పులు తగ్గి, కండరాలు బలపడేందుకు వేడి కాపడం పెట్టడం, వేగంగా తరుముతూ పరిగెత్తించడం చేస్తారు. అనారోగ్యం చేసినప్పుడు మందులు వేసి మరీ వాటిని జాగ్రత్తగా చూస్తారు. బాగా తెలిసినవారు మినహా మూడో మనిషిని కోళ్ల పెంపకం కేంద్రంలోకి అనుమతించరు. ప్రత్యేకమైన ఆహారం, మందులు, గాబులు, కూలీ ఖర్చులు కలిపి ఒక్కో పందెం కోడిని తయారు చేసేందుకు సగటున 20వేల నుంచి 30వేల వరకూ ఖర్చుచేస్తున్నారు. కోడి పందేలను జూదంలా కాకుండా సంప్రదాయంగా భావిస్తూ కొనసాగిస్తున్నామని అందుకోసమే ఏటా వ్యాపారంగా కాకుండా ఇదో వ్యాపకంలా భావించి కోళ్లను పెంచుతున్నామని పెంపకం దారులు చెబుతున్నారు.
ఆంక్షలకు విరుద్ధంగా కత్తులు దూసిన పందెం కోళ్లు.. పందెం రాయుళ్లకు కాసులు