Son Killed His Father For Money In NTR District : చేతిలో డబ్బుల్లేవ్, పొలం అమ్ముదామంటే తండ్రి ఒప్పుకోలేదు, ఇంటి నుంచి బయటకెళ్లి బతకమన్నాడు, ఆయన్నే తుదముట్టిస్తే ఆస్తి అంతా తనదైపోతుందని అనుకున్నాడు ఆ కుమారుడు. అంతే ఒక్క దెబ్బతో తండ్రిని ఎలా మట్టుబెట్టాలో యూట్యూబ్‌లో వెతికాడు. గుట్టుచప్పుడు కాకుండా కన్న తండ్రిని విచక్షణా రహితంగా కొట్టి చంపేశాడు. చేసిన నేరం తనపైకి రాకుండా ఉండేందుకు పక్క పొలం రైతుతో ఉన్న వివాదానికి ముడిపెట్టాడు.
అంతేకాదు ఏమీ తెలియనట్లు జాతీయ రహదారిపై ధర్నాకు దిగి, కుటుంబాన్ని సైతం రోడ్డెక్కించాడు. నిందితులను అరెస్టు చేయకుండా పోలీసులు కాలయాపన చేస్తున్నారని ఆరోపణలకు దిగి అందరినీ నమ్మించాడు. అయ్యో పాపం తండ్రి అంటే ఎంతటి ప్రేమో అని ప్రతి ఒక్కరూ అనుకున్నారు. సానుభూతీ తెలిపారు. పోలీసులు రంగంలోకి దిగి తమదైన శైలిలో విచారించి, ఘోరాన్ని బట్టబయలు చేయడంతో అందరూ నిశ్చేష్టులయ్యారు. వేరే దిక్కులేక నేరాన్ని అంగీకరించి కటకటాల పాలైన కర్కశ తనయుడి దురాగతమిది.
మైలవరం ఏసీపీ వై.ప్రసాదరావు తెలిపిన వివరాల మేరకు మైలవరం మండలం మొర్సుమిల్లి శివారు ములకలపెంటకు చెందిన కడియం శ్రీనివాసరావు (57) గత శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అతడి కుమారుడు పుల్లారావు ఫిర్యాదు మేరకు వీరి పక్కపొలం రైతు, అతని గుమస్తాను అనుమానితులుగా పేర్కొని దర్యాప్తు ప్రారంభించారు. అయితే రెండ్రోజులు దర్యాప్తు చేశాక శ్రీనివాసరావు కుమారుడి ప్రవర్తన, హత్య జరిగిన రోజు అతని కదలికలపై అనుమానం వచ్చి లోతైన దర్యాప్తు చేశారు. పోలీసులు క్షుణ్నంగా విచారించగా తానే హత్య చేసినట్లు పుల్లారావు ఒప్పుకొన్నాడు.
తండ్రిని నరికి చంపిన కొడుకు - ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్లాన్
పొలం అమ్మలేదని అక్కసు : పుల్లారావు ఎంబీఏ పూర్తి చేసి, కొన్నాళ్లు హైదరాబాద్‌లో ఉద్యోగం చేశాడు. ఆ సమయంలో బెట్టింగులకు అలవాటై అప్పులు చేసి ఇంటికి రావడంతో ఇకనైనా మారతాడనే ఆశతో తండ్రి అప్పు తీర్చేశాడు. అప్పటి నుంచి భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి ఇంటి వద్దే ఉంటున్నాడు. తండ్రి పొలం పనులు, తల్లి పాడితో కుటుంబాన్ని నెట్టుకొస్తుండగా, పుల్లారావు మళ్లీ బెట్టింగ్‌లకు దిగి రూ.లక్షల్లో అప్పులు చేశాడు. ఒక ఎకరం పొలం అమ్మాలని తండ్రిపై ఒత్తిడి తెచ్చాడు. దీనికి తండ్రి శ్రీనివాసరావు ఒప్పుకోక పోవడంతో అతడిని చంపడమే మార్గమని భావించాడు. ఒకరోజు ముందుగా ఒకే దెబ్బతో చంపడం ఎలాగని యూట్యూబ్‌లో వీడియోలు వెతికాడు.
ఎవరికీ అనుమానం రాకుండా : ఎప్పుడూ పొలానికి వెళ్లని పుల్లారావు హత్య జరిగిన రోజు చుట్టుపక్కల చేలకు వెళ్లి అక్కడి రైతులతో మాటామంతీ కలిపాడు. సాయంత్రం వేళ తండ్రిని కర్రతో కొట్టి చంపాక, ద్విచక్ర వాహనంపై మైలవరం వెళ్లాడు. సాయంత్రమైనా భర్త ఇంటికి రాకపోవడంతో, కుమారుడికి ఫోన్ చేసిన తల్లికి తాను ఉదయం నుంచి మైలవరంలో ఉన్నానని నమ్మబలికాడు. సమీప బంధువులను పొలానికి పంపి పరిశీలించగా, మృతదేహం కనిపించడంతో ఇంటికి వచ్చిన అతడు పక్కపొలం వివాదాన్ని తెరమీదకు తెచ్చాడు.
పోలీసులనూ బురిడీ కొట్టించి : పోలీసులు మొదట ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. రెండ్రోజుల తర్వాత పుల్లారావు వైఖరిపై అనుమానం వచ్చి క్షుణ్నంగా విచారించారు. ఈ క్రమంలో పొంతన లేని సమాధానాలు చెప్పి దొరికి పోయాడు. తమదైన శైలిలో లోతుగా విచారిస్తే మొత్తం పూసగుచ్చినట్లు వివరించాడు. నిందితుడికి వైద్య పరీక్షలు చేయించాక కోర్టులో హాజరు పరుస్తున్నామని పేర్కొన్నారు. సమావేశంలో సీఐ దాడి చంద్రశేఖర్, ఎస్సైలు కె.సుధాకర్, సతీష్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
అన్నమయ్య జిల్లాలో దారుణం - ఆస్తికోసం తండ్రిని కడతేర్చిన కుమారుడు - Son Killed Father