TTD Clarity on laddu and SED Ticket Costs Issue : ఆంధ్రప్రదేశ్లోని తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త ఈవోగా వచ్చిన శ్యామలరావు వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. భక్తుల ఇబ్బందులపై దృష్టిపెడుతూ తీసుకోవాల్సిన చర్యలపై ఆలయ సిబ్బందికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఈక్రమంలోనే శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, లడ్డూ ధరలు కోసం సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై స్పందించారు. అందులో ఎటువంటి నిజం లేదని ఈవో స్పష్టం చేశారు. భక్తులను మోసగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా అవాస్తవాలు, దళారులను నమ్మి భక్తులు మోసపోవద్దని సూచించారు.
అవన్నీ అవాస్తవం - టీటీడీ స్టేట్మెంట్ :కొన్ని వాట్సప్ గ్రూపులలో తిరుమల దర్శనానికి సంబంధించి అధిక ధరలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు పొందవచ్చునని కొంతమంది వారి ఫోన్ నంబర్లతో కూడిన సమాచారం సర్క్యులేట్ అవుతుంది. వాస్తవానికి శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి టీటీడీ వెబ్సైట్ ద్వారా మాత్రమే కాకుండా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన టూరిజం విభాగాలకు కొంత మేరకు టికెట్ల కేటాయింపు జరిగింది.
భక్తులు ఎవరైనా సంబంధిత టూరిజం ద్వారా ఈ టిక్కెట్లను పొందే సౌకర్యం ఉందని టీటీడీ తెలిపింది. టూరిజం ద్వారా రావాలి అనుకొనే భక్తులు, దళారీల ద్వారా కాకుండా, నేరుగా, రాష్ట్ర టూరిజం వెబ్సైట్ ద్వారా కూడా దర్శనం ప్యాకేజీ టికెట్స్ పొందే అవకాశం ఉందని స్పష్టం చేసింది. కాబట్టి భక్తులు అంతా దీనిని గమనించాలని కోరింది. సరైన సమాచారానికి టీటీడీ అఫీసియల్ వెబ్‌సైట్ www.tirumala.org , https://ttdevastanams.ap.in ను మాత్రమే సంప్రదించాలని సూచించింది.