TTD Decides To Ban Political And Hate Speeches In Tirumala : తిరుమలలో రాజకీయ, ద్వేషపూరిత ప్రసంగాలను నిషేధించాలని టీటీడీ నిర్ణయించింది. శ్రీవారి ఆలయ పవిత్రత, ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. గత కొంతకాలంగా కొందరు రాజకీయ నాయకులు శ్రీవారి దర్శనం తరువాత ఆలయం ముందు మీడియాతో మాట్లాడటం పరిపాటిగా మారింది. అప్పుడు రాజకీయ ప్రసంగాలు, విమర్శలు చేస్తున్నారు. దీంతో తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణానికి ఆటంకం కలుగుతోంది. ఈ నేపథ్యంలో తిరులమలో రాజకీయ ప్రసంగాలను నిషేధించాలని టీటీడీ బోర్డు ఇటీవల తీర్మానించింది. ఆ నిర్ణయాన్ని తాజాగా అమలులోకి తీసుకువచ్చింది. ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ పేర్కొంది.
రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి టీటీడీ సంచలన నిర్ణయాలను తీసుకుంటుంది. ఈ క్రమంలోనే నకిలీ గుర్తింపు కార్డులతో తిరుమల శ్రీవారి సేవా టికెట్లు, వసతి గదులను పొందేందుకు అక్రమార్కులు చేస్తున్న యత్నాలకు అడ్డుకట్ట వేసేందుకు కొద్దిరోజుల కిందటే టీటీడీ కార్యచరణ మొదలు పెట్టింది. ఇందుకోసం ఆధార్‌ను టీటీడీలోని పలు సేవలకు అనుసంధానం చేయనుంది.
ఆధార్‌తో అక్రమార్కులకు చెక్ - టీటీడీ కీలక నిర్ణయం
పలు కీలక నిర్ణయాలు : అలాగే సర్వదర్శనానికి వచ్చే భక్తులకు 2 నుంచి 3 గంటల్లోగా దర్శన భాగ్యం కల్పిస్తామని టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయించారు. దీనికోసం ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తామని, కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా భక్తులకు త్వరితగతిన దర్శనం చేయించేందుకు నిర్ణయించారు. అదేవిధంగా టీటీడీలో పని చేస్తున్న అన్యమత ఉద్యోగులను బయటకు పంపేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే విషయమై ప్రభుత్వానికి నివేదించి ప్రభ్వుత శాఖలకు బదిలీ చేసేలా నిర్ణయం తీసుకుంటామని సమావేశంలో తెలిపారు.
వాటిని రద్దు చేస్తూ నిర్ణయం : తిరుమలలో డంపింగ్ యార్డులోని చెత్తను మూడు నెలల్లో తొలగించాలని, తిరుపతిలోని శ్రీనివాస సేతును గరుడ వారధిగా పేరు మార్చడానికి నిర్ణయించామన్నారు. ప్రైవేటు బ్యాంకుల్లోని టీటీడీ నగదును ప్రభుత్వ బ్యాంకుల్లోకి బదిలీ చేస్తామని తెలిపారు. శారదా పీఠం లీజును రద్దు చేసి స్థలాన్ని తిరిగి తీసుకుంటామని వెల్లడించారు. అదేవిధంగా పర్యాటక శాఖ ద్వారా ఇచ్చే దర్శన టికెట్లు రద్దు చేస్తున్నామని అన్నారు. నూతనంగా నిర్మిస్తున్న ముంతాజ్ హోటల్ అనుమతి రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తిరుపతి ప్రజలకు ప్రతినెలా మొదటి మంగళవారం దర్శనానికి అవకాశం కల్పిస్తామని తెలిపారు. శ్రీవాణి ట్రస్టు పేరు రద్దు చేస్తున్నట్లు టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది.
శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్- ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల
ఇకపై ఆ టికెట్లు రద్దు - రెండు గంటల్లోనే శ్రీవారి సర్వదర్శనం - టీటీడీ సంచలన నిర్ణయాలు