TTD on Stampede Issue In Tirupati :వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి బాధ్యులను ఉపేక్షించే ప్రసక్తే లేదని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం తిరుపతి అన్నమయ్య భవన్లో టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన వివరాలను వెల్లడించారు.
తిరుపతిలో తొక్కిసలాట ఘటన దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు చెక్కులు సిద్ధం చేశామన్నా ఆయన శనివారం బాధితుల ఇళ్లకు వెళ్లి చెక్కులు అందజేస్తామని తెలిపారు. మృతుల కుటుంబసభ్యుల్లో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ఘటనపై ఇప్పటికే న్యాయవిచారణకు సీఎం ఆదేశించారని, తప్పిదం ఎలా జరిగిందనే దానిపై న్యాయ విచారణ త్వరగా పూర్తిచేయాలని సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు.
తిరుపతి ఘటనలో ఇద్దరు అధికారుల సస్పెన్షన్, ముగ్గురుపై బదిలీ వేటు వేసిన చంద్రబాబు
తొక్కిసలాట బాధితుల ఇళ్లకు వెళ్లి చెక్కులు అందజేస్తాం: టీటీడీ ఛైర్మన్ (ETV Bharat)
"ఘటనపై ఇప్పటికే న్యాయవిచారణకు సీఎం ఆదేశించారు. తప్పిదం ఎలా జరిగిందనే దానిపై న్యాయ విచారణ జరుగుతుంది. విచారణ త్వరగా పూర్తిచేయాలని సీఎం దృష్టికి తీసుకెళ్తాం. తొక్కిసలాట వంటి ఘటనలు మున్ముందు జరగకుండా చూస్తాం. ఘటనకు సంబంధించి ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తే లేదు. చిన్నచిన్న పొరపాట్లు జరిగాయని మా దృష్టికి వచ్చింది." - బీఆర్ నాయుడు టీటీడీ ఛైర్మన్
ఎవరో ఏదో మాట్లాడితే స్పందించాల్సిన అవసరం లేదు :ఇలాంటి ఘటనలు మున్ముందు జరగకుండా చూస్తామని వివరించారు. ఘటనకు సంబంధించి ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తే లేదని అన్నారు. చిన్నచిన్న పొరపాట్లు జరిగాయని తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. తొక్కిసలాట ఘటనపై క్షమాపణ చెప్పడంలో తప్పులేదన్న ఆయన క్షమాపణ చెప్పినంత మాత్రాన బతికిరారు కదా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరో ఏదో మాట్లాడినంత మాత్రాన స్పందించాల్సిన అవసరం లేదని, తప్పిదం జరిగింది ఎలా జరిగిందో విచారణ చేయిస్తామని తెలిపారు. బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ ఛైర్మన్ అన్నారు.
మరవైపు బుధవారం రాత్రి గాయపడి రుయా, స్విమ్స్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారు ప్రస్తుతం కోలుకుంటున్నారు. వారి ఆరోగ్య పరిస్థితులను బట్టి వాటిని డిశ్చార్జ్ చేయనున్నట్లు వైద్యులు తెలిపారు.
తిరుపతిలో తొక్కిసలాట - ఆరుగురు భక్తుల మృతి