TTD Chairman BR Naidu : వైకుంఠ ఏకాదశి సందర్బంగా శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా స్వామి వారి దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఈ నెల జనవరి 10 నుంచి 19 వరకు తిరుమలలో వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంటాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో అన్ని సర్వదర్శన టోకెన్ జారీ ఏర్పాట్లను వేగంవంతం చేశారు. టోకెన్లు జారీ చేసే ప్రక్రియపై ఈవో శ్యామలరావుతో ఛైర్మన్ బీఆర్ నాయుడు చర్చించినట్లు తెలిపారు.
లక్షకు పైగా టోకెన్లు : ఈ సందర్భంగా ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ భక్తులు సంయమనం పాటించి శ్రీవారి దర్శనం చేసుకోవాలని సూచించారు. 10 రోజుల పాటు భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసేందుకు వీలుగా మంచి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి జనవరి 9వ తేదీన ఉదయం 5 గంటల నుంచి లక్షా 20 వేల టోకెన్లు జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దీనికోసం తిరుపతిలోని 8 కేంద్రాలలో 90 కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్లు కలుపుకుని మొత్తం 94 కౌంటర్లలో టోకెన్లు ఇవ్వడం జరుగుతుందన్నారు.
సామాన్య భక్తులే మొదటి ప్రాధాన్యత : తిరుపతిలోని ఇందిరా మైదానం, విష్ణునివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, రామచంద్ర పుష్కరిణి, శ్రీనివాసం కాంప్లెక్స్, భైరాగిపట్టెడలోని రామానాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్ పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జీవకోనలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అదేవిధంగా తిరుమలలో స్థానికుల కోసం తిరుమల బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు. సామాన్య భక్తులకు అనుకూలంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. వీఐపీలకు ప్రస్తుతానికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదని పేర్కొన్నారు.