TTD Cancelled VIP Break Darshan:కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు జనవరిలో తిరుమల వెళ్తున్నారా? అయితే మీకో ముఖ్య గమనిక. ఈ నెలలో ఆ తేదీన వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటన విడుదల చేసింది. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో 2025 జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు పది రోజుల పాటు వైకుంఠ ఏకాదశి వేడుకలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించి అనేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే.. వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో జనవరి 7వ తేదీ మంగళవారం నాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది.
సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం రోజు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే జనవరి 7వ తేదీన వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దుచేసినట్లు టీటీడీ తెలిపింది. ఈ నేపథ్యంలో జనవరి 6వ తేదీన సిఫార్సు లేఖలు స్వీకరించబోమని ప్రకటనలో తెలిపింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులు సహకరించాలని టీటీడీ కోరింది.
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వివరాలు ఇవే:కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంలో భాగంగా.. జనవరి 7వ తేదీ ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఆనంద నిలయం మొదలు బంగారు వాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడుగుతారు. ఈ సమయంలో స్వామి వారి మూల విరాట్టును వస్త్రంతో కప్పి ఉంచుతారు.