తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫిబ్రవరి 4న తిరుమల వెళ్తున్నారా? - ఆ రోజు పలు సేవలు రద్దు - RATHA SAPTAMI 2025 IN TIRUMALA

తిరుమలలో ఫిబ్రవరి 4న సూర్యప్రభ వాహన సేవతో రథసప్తమి వేడుకలు ప్రారంభం - వీఐపీ బ్రేక్‌ దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేసిన టీటీడీ

Ratha Saptami 2025 in Tirumala
Ratha Saptami 2025 in Tirumala (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 24, 2025, 6:59 PM IST

Ratha Saptami 2025 in Tirumala :తిరుమలలో మినీ బ్రహ్మోత్సవాల తరహాలో జరగనున్న రథసప్తమి ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీడీడీ) ఈవో శ్యామలరావు అధికారులను ఆదేశించారు. రథసప్తమి వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లపై తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో అదనపు ఈవో వెంకయ్య చౌదరి, పలు విభాగాల అధికారులతో ఆయన సమీక్షించారు. శ్రీవారి భక్తులు గ్యాలరీల్లోకి ప్రవేశించే, నిష్క్రమణ ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్యాలరీలలో ఉండే భక్తులకు సకాలంలో అన్న ప్రసాదాలు, తాగునీరు అందించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్, భద్రత సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.

సూర్యప్రభ వాహన సేవతో రథసప్తమి వేడుకలు ప్రారంభం :అనంతరం అదనపు ఈవో వెంకయ్య చౌదరి, అధికారులతో కలిసి తిరుమల మాడ వీధుల్లో ఏర్పాట్లను ఈవో శ్యామలరావు పరిశీలించారు. ఈ సందర్భంగా శ్యామలరావు మాట్లాడుతూ శ్రీవారి ఉత్సవాల్లో రథసప్తమి అత్యంత ముఖ్యమైనదని, ఏటా శుక్లపక్ష సప్తమి తిథిలో సూర్య జయంతి సందర్భంగా తిరుమలలో రథసప్తమిని వైభవంగా నిర్వహిస్తారని అన్నారు. ఈ వేడుకకు దాదాపు లక్ష మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. రథసప్తమి వేడుకల్లో భాగంగా స్వామివారు సప్త వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారని, ఫిబ్రవరి 4న ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహన సేవతో రథసప్తమి వేడుకలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. అదే రోజు రాత్రి చంద్రప్రభ వాహనసేవతో శ్రీమలయప్ప స్వామివారి వాహన సేవలు ముగుస్తాయని ఆయన తెలిపారు.

భక్తులకు టీటీడీ సూచనలు :

  • రథసప్తమి సందర్భంగా ప్రివిలేజ్ దర్శనాలు, పలు సేవలు రద్దు.
  • అష్టాదళ పాదపద్మారాధన, ఊంజల్ సేవ, కల్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలు రద్దు.
  • ఎన్‌ఆర్‌ఐలు, సీనియర్ సిటిజన్లు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలు రద్దు.
  • తిరుపతిలో వచ్చే నెల 3 నుంచి 5 వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీ చేయరు.
  • ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.
  • బ్రేక్ దర్శనాలకు సంబంధించి వచ్చే నెల 3న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు.
  • ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300 దర్శనం) టోకెన్లు ఉన్న భక్తులు వేచి ఉండకుండా ఉండేందుకు నిర్ణీత టైంలో మాత్రమే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద రిపోర్టు చేయాలి.

శ్రీవారి వాహనసేవల వివరాలు : -

ఉదయం : -

  • సూర్యప్రభ వాహన సేవ - 5.30 గంటల నుంచి 8 గంటల వరకు
  • చిన్నశేష వాహన సేవ - 9 గంటల నుంచి 10 గంటల వరకు
  • గరుడ వాహన సేవ - 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు

మధ్యాహ్నం :-

  • హనుమంత వాహన సేవ - 1 గంట నుంచి 2 గంటల వరకు
  • చక్రస్నానం - 2 గంటల నుంచి 3 గంటల వరకు

సాయంత్రం :-

  • కల్పవృక్ష వాహన సేవ - 4 గంటల నుంచి 5 గంటల వరకు
  • సర్వభూపాల వాహన సేవ - 6 గంటల నుంచి 7 గంటల వరకు

రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు - చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇస్తారు.

తిరుమలలో భక్తులకు "కంకణం" - 2 గంటల్లోనే దర్శనం! - మీకు తెలుసా?

సమ్మర్​లో తిరుమల వెళ్తారా? - స్పెషల్ దర్శనం టికెట్స్ రిలీజ్ డేట్ వచ్చేసింది!

ABOUT THE AUTHOR

...view details