RTC Heavy Vehicle Driving Training :చాలా మందికి డ్రైవింగ్ నేర్చుకోవడం అంటే ఆసక్తి ఉంటుంది. కారు డ్రైవింగ్‌లో శిక్షణ ఇచ్చేందుకు పలు డ్రైవింగ్ స్కూల్లు ఉన్నాయి. కానీ హెవీ వెహికల్(భారీ వాహనాలు) నేర్చుకోవాలంటే చాలా తక్కువ సంఖ్యలో శిక్షణ కేంద్రాలు ఉన్నాయి. పైగా కాస్త అధిక ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దీంతో చాలామంది వాహనాలపై పనిచేస్తూనో, తెలిసిన వాహన చోదకుల సాయంతోనే డ్రైవింగ్‌లో మెలకువలు నేర్చుకుంటుంటారు. ఈ ఇబ్బందిని తొలగించేందుకు నిర్మల్ ఆర్టీసీ ఆధ్వర్యంలో హెవీ వెహికిల్ డ్రైవింగ్ తర్ఫీదు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.
నెలరోజుల పాటు భారీ వాహనాల డ్రైవింగ్‌లో శిక్షణ : భారీ వాహనాలపై(హెవీ వెహికల్) తర్ఫీదును ఆర్టీసీ సంస్థ వారు నెల రోజుల పాటు ఇవ్వనున్నారు. 10 రోజుల పాటు ప్రత్యక్ష బోధన ఉంటుంది. శిక్షణలో భాగంగా ట్రాఫిక్ రూల్స్, బస్సు పనిచేసే విధానం ఇతరత్రా మెలకువలు, మెరుగైన డ్రైవింగ్‌కు అవసరమైన సూచనలు, సలహాలను అందిస్తారు. దీనికోసం బస్‌డిపో ఆవరణలోని భవనంలో ఓ గదిని, ప్రొజెక్టర్‌ను, నిబంధనల గురించి తెలిపే బొమ్మల ఛార్టు సిద్ధం చేశారు.
మిగతా 20 రోజులు రోజుకు 8 నుంచి 10 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ చేయించనున్నారు. ఇందు కోసం రెండు స్టీరింగులు ఉన్నటువంటి బస్సును ఉపయోగిస్తారు. మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, ఫిట్‌నెస్ కోసం చిన్న చిన్న వ్యాయామాలు, యోగా వంటివి చేయిస్తారు. శిక్షణలో భాగంగా ఎలక్ట్రానిక్ కంట్రోల్ సిస్టం, యాంటీ బ్రేక్ సిస్టం, చిన్న చిన్న మరమ్మతులపైనా అవగాహన కల్పించనున్నారు. ఒక్కో బృందంలో 15 మందికి ట్రైనింగ్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఎవరు ఈ శిక్షణకు అర్హులంటే? :నెల రోజుల పాటు జరిగే ఈ శిక్షణకు రూ.15,600 చెల్లించాల్సి ఉంటుంది. లైట్ మోటారు వెహికిల్ (ఎల్‌ఎంవీ), ట్రాన్స్‌పోర్టు లైసెన్స్ కలిగిన వారు ఈ శిక్షణకు అర్హులు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్ జారీ చేస్తారు. దీని సాయంతో ఆర్టీఏ కార్యాలయంలో లైసెన్సు పొందడం మరింత సులభమవుతుంది.