TSPSC Group 1 Notification Cancel: గ్రూప్-1 నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ రద్దు చేసింది. ఈ మేరకు వెబ్ నోటీసును విడుదల చేసింది. 503 పోస్టులతో గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. 2022 ఏప్రిల్‌లో 503 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్(TSPSC Group 1) వెలువడింది. అదే ఏడాది అక్టోబరు 16న ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా ఈ పరీక్షను టీఎస్‌పీఎస్సీ రద్దు చేసింది. 2023 జూన్ 11న రెండోసారి పరీక్షను నిర్వహించింది. దాదాపు 2 లక్షల 33 వేల మంది రాశారు. అయితే ఈ పరీక్ష నిర్వహణలోనూ లోపాలున్నాయని, అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోలేదని, ప్రిలిమినరీ పరీక్ష రోజున ఇచ్చిన హాజరు సంఖ్యకు, తుది కీ సమయంలో ఇచ్చిన హాజరు సంఖ్యకు పొంతన లేదని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.
గ్రూప్-1పై కీలక అడుగులు - సుప్రీంలో అప్పీలు ఉపసంహరణకు టీఎస్‌పీఎస్సీ పిటిషన్
TSPSC Group 1 Issue : ఈ అంశంపై న్యాయస్థానం విచారణ జరిపింది. అనంతరం పరీక్ష రద్దు చేసి మరోసారి నిర్వహించాలని తీర్పు ఇచ్చింది. దీనిని డివిజన్ బెంచ్ కూడా సరైనదేనని స్పష్టం చేసింది. దీంతో టీఎస్‌పీఎస్సీ న్యాయ నిపుణులతో చర్చించి సుప్రీంకోర్టులో అప్పీలు పిటిషన్ వేసింది. ఈ లోపు రాష్ట్రంలో ఎన్నికలు జరిగి ప్రభుత్వం మారింది. దీంతో టీఎస్‌పీఎస్సీ(TSPSC) ప్రక్షాళనపై కొత్త సర్కార్ దృష్టి సారించింది. ఈ క్రమంలోనే కమిషన్ ఛైర్మన్, సభ్యులు రాజీనామా చేశారు. దానికి గవర్నర్ ఆమోదముద్ర వేశారు.