TS Government Concentration on GST : దేశవ్యాప్తంగా ప్రతిసంవత్సరం జీఎస్టీ రాబడులు క్రమంగా పెరుగుతున్నాయి. 2024- 25 ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్‌లో వస్తు, సేవల పన్ను వసూళ్లు మరోసారి భారీగా నమోదయ్యాయి. రూ.2.10 లక్షల కోట్లు రాబడి రాగా రీఫండ్‌లు ఇచ్చిన తర్వాత నికర ఆదాయం రూ.1.92లక్షల కోట్లతో 15.5 శాతం పెరుగుదలను నమోదు చేసింది. గతేడాదితో పోలిస్తే 7 శాతం మాత్రమే పెరిగింది. జాతీయ సగటు వృద్ధి 11 శాతానికి మించలేదు. ఈ ఏడాది ఏప్రిల్‌లో మధ్యప్రదేశ్ అత్యధికంగా 30 శాతం పెరుగుదలతో తొలి స్థానంలో ఉండగా, ఒడిశా 27 శాతం వృద్ధితో రెండో స్థానంలో నిలిచింది, దిల్లీ 24, బిహార్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్‌లు 15 శాతం, ఉత్తరప్రదేశ్, హరియాణలు 12, తెలంగాణ 9 శాతం మాత్రమే పెరుగుదల నమోదు చేసింది.
Statistics of Central Finance Department 2024 : కేంద్ర ఆర్ధిక శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గతేడాది ఏప్రిల్‌తో పోల్చితే తెలంగాణలో రూ.322 కోట్లు మాత్రమే ఎక్కువ ఆదాయం వచ్చింది. ఇక ఈ ఏడాది మే నెలలో చాలా రాష్ట్రాల్లో జాతీయ సగటు కంటే తక్కువ ఆదాయం వచ్చినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మే నెలలో మాత్రం రాష్ట్రం కేవలం రూ.215 కోట్లు అదనంగా ఆర్జించింది. ఎన్నికల నియమావళి ముగిసినందున పాలనపై దృష్టి పెట్టిన రేవంత్ సర్కార్ పన్నులు పెంచకుండానే ఆదాయ వనరుల పెంపుపై దృష్టి సారిస్తోంది. అధికారుల్లో సమన్వయ లోపాన్ని సరిదిద్దుకుని జీరో బిజినెస్ నిర్వహిస్తున్న ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు, అక్రమార్కులతో అంటకాగి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న అవినీతి అధికారుల భరతం పట్టే కార్యాచరణ అమలుపైనా దృష్టిసారిస్తోంది.