Phone Tapping Case Update : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. పలువురు ఫోన్లను ప్రభాకర్‌రావు బృందం ట్యాప్ చేసినట్లు నిర్ధరించిన పోలీసులు తాజాగా త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనా రెడ్డి సంభాషణలు విన్నట్లు నిర్ధారించారు. ఈ మేరకు ఇంద్రసేనారెడ్డి ఓఎస్డీ(OSD) నర్సింహులు వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు.
ఫోన్‌ట్యాపింగ్ కేసు దర్యాప్తు మొదలై దాదాపు ఏడాది కావొస్తున్నా నేటికీ సంచలన విషయాలు బహిర్గతం అవుతూనే ఉన్నాయి. త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి ఫోన్ ట్యాప్ అయినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇంద్రసేనారెడ్డి ఓఎస్డీ(OSD) నర్సింహులు పేరిట ఉన్న ఫోన్ నంబరును తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచి-ఐఎస్బీ కేంద్రంగా ట్యాప్ చేసినట్లు వెల్లడైంది. ఆ విషయాన్ని గుర్తించిన హైదరాబాద్ పోలీసులు రెండ్రోజులక్రితం నర్సింహులును పిలిచి విచారించారు. మీరు చెప్పేవరకు ఆ విషయం తనకు తెలియదని వాంగ్మూలమిచ్చినట్లు సమాచారం.
ప్రభాకర్‌రావును విచారిస్తేనే అంతా తెలుస్తుంది :ఈ నంబర్‌ని ట్యాప్‌చేయాలని ISBని ఎవరు ఆదేశించారనే విషయం అమెరికాకు పారిపోయిన ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావును విచారిస్తేనే తెలుస్తుంది. ఆయన్ను భారత్‌కు రప్పించేందుకు పోలీసులు ఎన్ని యత్నాలుచేస్తున్నా సఫలీకృతం కావట్లేదు. రాష్ట్ర గవర్నర్‌గా పనిచేసిన తమిళిసై ఫోన్‌నూ ట్యాప్ చేసినట్లు గతంలో ప్రచారం జరిగినా.. దర్యాప్తు క్రమంలో ఇప్పటివరకు అలాంటి అంశం వెల్లడి కాలేదని సమాచారం.2014 నుంచి తన OSD పేరిట ఉన్న ఫోన్ నంబరునే ఇంద్రసేనారెడ్డి వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. 2023 నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ఆ నంబరును ఎస్‌ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు బృందం ట్యాపింగ్‌జాబితాలో చేర్చినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.