అడుగడుగు పర్యవేక్షలో టీ-సేఫ్ - మహిళల భద్రత కోసం అందుబాటులోకి కొత్త యాప్ (ETV Bharat) T Safe App Importance for Women Safety :మహిళల భద్రత కోసం రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలోనే ప్రయాణ సమయంలో మహిళలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఉమెన్ సేఫ్టీ వింగ్, పోలీసు శాఖ సంయుక్తంగా టీ సేఫ్ యాప్‌ను రూపొందించారు. ఈ యాప్ ప్రయాణ సమయంలో ప్రతి అడుగున కనిపెడుతూ, పర్యవేక్షణ చేస్తూ ఉంటుంది.
ప్రస్తుతం ఈ యాప్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత, లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అవ్వగానే మానిటరింగ్, డయల్ 100 ఆప్షన్ కనిపిస్తుంది. మానిటరింగ్ నొక్కి, మనం చేరుకోవాల్సిన ప్రదేశం, ఏ వాహనంలో వెళ్తున్నామో ఎంటర్ చేయగానే పర్యవేక్షణ మొదలవుతుంది. ప్రయాణసమయంలో మహిళలకు భద్రత పరమైన ఇబ్బందులు తలెత్తుతే, డయల్ 100 కు చేస్తే పోలీసులు అలర్ట్ అవడమే కాకుండా మన లొకేషన్ ఆధారంగా సంబంధిత స్టేషన్‌కు మన వివరాలు వెళ్తాయి.
అత్యవసరం సమయంలో 5 నిమిషాల్లోనే పోలీసుల స్పందన :5 నిమిషాల్లోనే పోలీసులు స్పందించి మన నంబర్‌కు ఫోన్ చేసి, మనం స్పందించకపోతే నేరుగా లొకేషన్‌కు వచ్చేస్తారు. యాప్‌లోనే కాదు వెబ్సైట్లోను దీని సేవలను పొందవచ్చని ఆప్ వినియోగదారులు చెబుతున్నారు. క్యాబ్‌ల్లో కానీ ఆటోల్లో కానీ రాత్రి సమయంలో తెలియని ప్రాంతాలకు వెళ్లినపుడు ఈయాప్ మహిళలకు ఎంతో ఉపయోగపడుతుంది. ప్రయాణం ప్రారంభించే ముందు వివరాలను నమోదు చేసి మానిటరింగ్ రిక్వెస్ట్ పెట్టుకుంటే చాలు, ఎలాంటి భయం లేకుండా మన గమ్యస్థానాలకు చేరుకోవచ్చు.
చిన్న ఫోన్ ద్వారా కూడా ప్రయాణ పర్యవేక్షణ సేవలు :ఇంత వరకు మనం స్మార్ట్‌లో ఉండే యాప్ గురించే చెబుతున్నాం. కానీ స్మార్ట్ ఫోన్ లేకున్నా, చిన్న ఫోన్ ద్వారా కూడా దీని సేవలను వినియోగించుకోవచ్చు. ప్రయాణం ప్రారంభించే ముందు 100కు డయల్ చేసి ఐవీఆర్ ద్వారా ‘8’ నంబర్‌ను క్లిక్ చేసి వివరాలను తెలియజేస్తే సెల్ టవర్ ఆధారంగా లొకేషన్‌ను పోలీసులు గుర్తిస్తారు. రిక్వెస్ట్ పెట్టిన తర్వాత ప్రతి 15నిమిషాలకు ఫోన్‌కు ఆటోమెటిక్ సేఫ్టీ మెసేజ్ వస్తుంది. దానికి నాలుగంకెల పాస్ కోడ్ పంపిస్తే మనం సురక్షితంగా ఉన్నామని పోలీసులు ధృవీకరిస్తారు. లేదంటే లోకేషన్ ఆధారంగా పోలీసులు మన చోటుకు వచ్చేస్తారు.
790 Patrol Cars Exclusively for T Safe Services :ప్రయాణ సమయంలో వెళ్లాల్సిన దారిలో కాకుండా వేరే మార్గంలో వెళ్లినా, సరిహద్దు దాటి వెళ్లినా ఎక్కువ సేపు ఆగినా టీ సేఫ్ కంట్రోల్ రూం నుంచి మన లోకేషన్ ఆధారంగా సంబంధిత పోలీస్ స్టేషన్‌కు 100 డయల్ చేస్తారు. దీంతో వెంటనే పోలీసులు అప్రమత్తమై మనకు కాల్ వస్తుంది. మనం స్పందించి సురక్షితమని చెబితే సరిపోతుంది, లేదంటే మన లొకేషన్ ఆధారంగా ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుంటారు. టీ సేఫ్ సేవలకు ప్రత్యేకంగా 790 పెట్రోలింగ్ కార్లు, 1085 బ్లూకోల్ట్స్ వెహికల్స్‌ను సిద్ధంగా ఉంచారు.
అమ్మాయిలు, మీ ఫోన్లో ఈ యాప్స్ ఉన్నాయా? లేదంటే బయటికి వెళ్లినప్పుడు ఇబ్బందులే!
మహిళల భద్రత కోసం టీ-సేఫ్ యాప్ - ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి