Sankranti Festival Trains :సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు బయల్దేరిన కుటుంబాలతో రైళ్లు నిండి కిటకిటలాడుతున్నాయి. పండగ సందర్భంగా స్పెషల్ రైళ్లు నడుస్తుండటంతో సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, లింగంపల్లి వంటి ముఖ్యమైన రైల్వేస్టేషన్ల వద్ద తీవ్రమైన రద్దీ నెలకొంది. ఇదే అదనుగా స్టేషన్లు, బోగీల్లోకి చేరి దొంగతనాలకు పాల్పడేందుకు అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు హైదరాబాద్‌లోకి ప్రవేశించినట్టు పోలీసులు గుర్తించి వెంటనే అలర్ట్ అయ్యారు. సికింద్రాబాద్ జీఆర్పీ ఎస్పీ చందన దీప్తి రైల్వేస్టేషన్లు, రైళ్లలో భద్రతా చర్యలపై సమీక్ష నిర్వహించారు. టోల్‌ఫ్రీ నంబరు 139కు ఫోన్ చేస్తే క్షణాల్లో భద్రతా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుంటారని ప్రయాణికులకు తెలిపారు.
వీళ్లు మామూలోళ్లు కాదు :సికింద్రాబాద్ జీఆర్పీ జిల్లా పరిధిలోని రైళ్లలో ఏటా జరిగిన చోరీ కేసుల్లో అధికశాతం పండగ వేళల్లో జరిగినవే ఉండటం గమనార్హం. ఆభరణాలు, నగదును ఇంట్లో భద్రపరిస్తే దొంగలు కొట్టేస్తారనే ముందు జాగ్రత్తగా సొంతూళ్లకు వెళ్లే మహిళలు వాటిని వెంట తీసుకెళ్తారు. దీంతో దొంగల బృందాలు ప్రయాణికుల మాదిరిగానే ప్లాట్‌ఫాం, బోగీల్లోకి చేరి చోరీలకు పాల్పడుతుంటాయి.
రైలు రాగానే బోగీల్లోకి ఎక్కేందుకు పోటీ పడే సమయంలో ప్రయాణికుల మెడలోని బంగారు గొలుసులు, చేతిలోని బ్యాగులు లాక్కొని మాయమవుతారు. ఇరానీ, హరియాణా ముఠాలు దృష్టి మరల్చి చోరీలకు పాల్పడటంలో చాలా ఎక్కవగా ఉంటారు. దావూద్‌గ్యాంగ్, పార్దీగ్యాంగ్‌లు రైలు బోగీల్లో చేరి ప్రయాణికులు అజాగ్రత్తగా ఉండటాన్ని, ఏమరపాటును అంచనా వేసి నిద్రమత్తులోకి చేరగానే ఆభరణాలు, నగదును కొట్టేసి తర్వాతి స్టేషన్‌లో దిగిపోతారు. కిటీకీలు, డోర్ల వద్ద కూర్చుని సెల్‌ఫోన్లు మాట్లాడుతున్న ప్రయాణికులను చూసి చైన్ స్నాచింగ్, మొబైల్ దొంగతనాలకు పాల్పడతారు.