TPCC Chief React On Konda Surekha Issue :మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తప్పిస్తారని ప్రత్యర్ధులు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. మంత్రి సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారని ఆరోజే ఆ ఇష్యూ ముగిసిందన్నారు. ఈ విషయంపై హైకమాండ్ కూడా ఎటువంటి వివరణ అడగలేదని వివరించారు. గాంధీ భవన్లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్ పలు అంశాలను ప్రస్తావించారు.
మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతారా? : సురేఖ, సీతక్కలు బలమైన మహిళా నాయకులు అయినందువల్లే సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తున్నారని పీసీసీ చీఫ్ ఆరోపించారు. సోషల్ మీడియాను బీఆర్ఎస్ దుర్వినియోగం చేస్తోందని ధ్వజమెత్తారు. విపక్షంలో ఉన్నప్పుడు తాము తమ పార్టీ గొంతు మాత్రమే వినిపించామని వివరించారు. కానీ బీఆర్ఎస్ మాత్రం ఫోటోలు మార్ఫింగ్ చేసి కొండా సురేఖపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఇలా పోస్ట్ చేసిన వారిపై కేసులు నమోదు చేస్తున్నామని పేర్కొన్నారు.
నెలలోపు పీసీసీ కార్యవర్గం : బీసీల విషయంలో పార్టీ సానుకూలంగానే ఉందన్నారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీల పక్షాన మాట్లాడారని,・అప్పుడే పార్టీ లైన్ తప్పారని అనడానికి లేదన్నారు. ఎంఐఎంతో స్నేహం వేరు, శాంతిభద్రతల అంశం వేరని స్పష్టం చేశారు. ఫిరోజ్ ఖాన్ వ్యవహారంలో చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సీఎంని కోరినట్లు తెలిపారు. తప్పు మా వాళ్లు చేసినా, వేరే వాళ్లు చేసినా చట్టప్రకారమే చర్యలు ఉంటాయని వివరించారు. దసరా లోపు నామినేటెడ్ పోస్టులు ప్రకటిద్దామని అనుకున్నామని, అయితే హర్యానా, జమ్మూ కశ్మీర్ ఎన్నికల వల్ల సాధ్యం కాలేదన్నారు. నెల లోపు పీసీసీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నట్లు వెల్లడించారు.