NHRC Seeks Report on Lagacharla Case : వికారాబాద్ జిల్లా లగచర్లలో జరిగిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ - ఎన్‌హెచ్‌ఆర్సీ స్పందించింది. ఆరోజు జరిగిన దానిపై రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని సీఎస్, డీజీపీకి నోటీసులు జారీ చేసింది. అంతే కాకుండా పరిశీలన కోసం లగచర్లకు ఓ బృందాన్ని పంపాలని కూడా జాతీయ మానవ హక్కుల కమిషన్ నిర్ణయించింది. ఫార్మాసిటీకి కావాల్సిన భూసేకరణ కోసం ఏర్పాటు చేసిన గ్రామసభలో కలెక్టర్, అదనపు కలెక్టర్‌పై దాడి జరగడంతో పోలీసులు పలువురిపై కేసు నమోదు చేశారు. అయితే నిందితులపై తప్పుడు కేసులు నమోదు చేశారని ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు.
పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో చాలా మంది ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన వర్గాలకు చెందినవారు ఉన్నారని, అరెస్టుల భయంతో మరికొందరు తమ ఇళ్లకు రావడం లేదని అందులో వివరించారు. లగచర్ల గ్రామంలో ఈనెల 11న ఏర్పాటు చేసిన గ్రామసభ ఉద్రిక్తంగా మారింది. గ్రామ సభ కోసం వచ్చిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ(కడా) ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డిలపై ఆయా గ్రామాల రైతులు కర్రలు, రాళ్లతో దాడులకు యత్నించారు. కలెక్టర్, అదనపు కలెక్టర్ త్రుటిలో తప్పించుకోగా కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయన్ను కాపాడేందుకు వెళ్లిన డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డికి గాయాలయ్యాయి.
NHRC, India takes cognizance of a complaint alleging harassment, torture and false implication of the villagers of Lagacharla, Vikarabad district in Telangana after they protested against the land acquisition without proper procedures. Press release at: https://t.co/Nv7Ow2pQg8 pic.twitter.com/C3XRYB9lv1
— NHRC India (@India_NHRC) November 21, 2024
కస్టడీలో ఉన్న వ్యక్తుల వివరాలు అందించాలన్న ఎన్‌హెచ్‌ఆర్సీ : తదుపరి రోజు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు 47 మందిని నిందితులుగా గుర్తించారు. వీరిలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కూడా ఉన్నారు. వీరిలో చాలా మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఏ సంబంధం లేకపోయినా తమను పోలీసులు అరెస్ట్ చేశారని వారు వాపోతున్నారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ సమయంలో పోలీసులు సుప్రీం కోర్టు మార్గదర్శకాలను పాటించలేదని రెండురోజుల క్రితం హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇవాళ ఈ వ్యవహారంపై స్పందించిన ఎన్‌హెచ్‌ఆర్సీ.. సీఎస్, డీజీపీని రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఇందులో ఎఫ్‌ఐఆర్‌ల స్థితి, న్యాయ కస్టడీలో ఉన్న వ్యక్తుల వివరాలు, భయంతో అడవుల్లో దాక్కున్న గ్రామస్థుల వివరాలు ఉండాలని సూచించింది. బాధిత మహిళలకు ఏదైనా వైద్య పరీక్షలు జరిగాయా ? గాయపడిన గ్రామస్థులకు వైద్య సహాయం అందించారా ? అనే వివరాలు కూడా తెలియజేయాల్సిందిగా కోరింది.
కొంతమంది చేసిన తప్పునకు ఊరంతా బలి - ప్రశాంతంగా ఉండే లగచర్లకు ఆరోజు ఏమైంది?
'లగచర్ల' ఘటనలో కీలక మలుపు - లొంగిపోయిన ప్రధాన నిందితుడు సురేశ్