Hair Dryer Blast In Karnataka : కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లాలో హెయిర్ డ్రయ్యర్ పేలిన ఘటనలో ఓ మహిళ రెండు ముంజేతులు కోల్పోయింది. గత వారం జరిగిన ఆ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలిని ఇళకల్ పట్టణానికి చెందిన బసవరాజేశ్వరిగా, హెయిర్ డ్రయ్యర్ విశాఖపట్నంలో తయారైనట్లుగా పోలీసులు గుర్తించారు. అసలేం జరిగిందంటే?
కర్ణాటకకు చెందిన పాపన్న మోజో 2017లో జమ్ముకశ్మీర్‌లో విధినిర్వహణలో అమరులయ్యారు. అప్పటి నుంచి ఆయన భార్య బసవరాజేశ్వరి ఇళికల్లో ఉంటున్నారు. ఆమె పొరుగు ఇంట్లో ఉన్న శశికళ పేరుతో నవంబర్ 15వ తేదీన ఓ పార్సిల్ వచ్చింది. ఆ సమయంలో ఆమె అందుబాటులో లేరు. దీంతో కొరియర్ డెలివరీ ఏజెంట్ నుంచి కాల్ రావడం వల్ల శశికళ తన పక్కింటి బసవరాజేశ్వరిని పార్సిల్ తీసుకోమని కోరింది. అయితేస, తాను ఆన్‌లైన్‌లో ఏ వస్తువునూ ఆర్డర్ చేయలేదని కూడా తెలిపింది శశికళ.
15వ తేదీ మధ్యాహ్నం బసవరాజేశ్వరి కొరియర్ కార్యాలయానికి వెళ్లి పార్సిల్ తీసుకొచ్చింది. ఆ తర్వాత నవంబర్ 16న పార్సిల్ తెరిచి చూడగా హెయిర్ డ్రయ్యర్ కనిపించింది. అది ఎలా పనిచేస్తుందో చూడాలని శశికళ సూచించడం వల్ల ప్లగ్‌లో పెట్టి స్విచ్ వేయగానే ఒక్కసారిగా పేలిపోయింది హెయిర్ డ్రయ్యర్. దీంతో ఆమె రెండు ముంజేతులూ నుజ్జయ్యాయి.
బసవరాజేశ్వరిని వెంటనే స్థానికులు ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అయితే శశికళ హెయిర్ డ్రయ్యర్‌ను ఆర్డర్ చేయకపోవడం గమనార్హం. ఘటనపై ఇళకల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అసలు ఎవరు హెయిర్ డ్రయ్యర్ ఆర్డర్ ఇచ్చారు? డబ్బులు ఎవరు చెల్లించి శశికళ అడ్రెస్‌కు పంపించారు? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
''15వ తేదీన బసవరాజేశ్వరికి ఆమె స్నేహితురాలు శశికళ కొరియర్ వచ్చిందని, తీసుకురావాలని తెలిపింది. అనంతరం బసవరాజేశ్వరి కొరియర్ తీసుకొచ్చింది. 16వ తేదీన హెయిర్ డ్రయ్యర్ టెస్ట్ చేద్దామని స్విచ్ ఆన్ చేయగానే పేలిపోయింది. దీంతో రెండు చేతుల వేళ్లు తెగిపోయి, రెండు ముంజేతులు ఛిద్రమై బసవరాజేశ్వరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేశాం. ఎఫ్‌ఎస్‌ఎల్ బృందం ఘటనాస్థలిలో ఆధారాలు సేకరించింది'' అని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అమర్‌నాథ్ రెడ్డి తెలిపారు.