తెలుగుదేశం - జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటన తేదీ ఖరారు Toll free number for TDP Janasena party workers: ఈ నెల 17న తెలుగుదేశం -జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తామని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు వెల్లడించారు. చిలకలూరిపేటలో తెలుగుదేశం - జనసేన నిర్వహించే ఉమ్మడి భారీ బహిరంగ సభలో మేనిఫెస్టో ప్రకటన ఉంటుందని తెలిపారు. చిలకలూరిపేట బహిరంగ సభ ద్వారా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని టీడీపీ-జనసేన నేతలు వెల్లడించారు.
టోల్ ఫ్రీ నెంబర్ (7306299999): చిలకలూరిపేట సభకు బస్సులు కేటాయించాలని ఆర్టీసీ ఎండీని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. డబ్బులు కట్టకున్నా ఒక పార్టీ సభలకు విపరీతంగా బస్సులు ఇస్తున్నారని అచ్చెన్న ఆరోపించారు. తమ సభకు బస్సులు కేటాయించకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. పోలీసుల తీరు మారకుంటే న్యాయపరంగా ముందుకెళ్తామని తెలిపారు. తెలుగుదేశం - జనసేన నేతలు, కార్యకర్తలపై వేధింపులు మానుకోవాలని కోరారు. పోలీసుల వేధింపుల నుంచి పార్టీ శ్రేణుల్ని కాపాడేందుకు ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ (7306299999) ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వైఎస్సార్సీపీ నుంచి రాష్ట్రాన్ని రక్షించాలన్నదే తెలుగుదేశం - జనసేన లక్ష్యంగా పేర్కొన్నారు. తెలుగుదేశం - జనసేన అభ్యర్థుల్ని ప్రకటించాక వైఎస్సార్సీపీ వణికిపోయిందని అన్నారు. రాష్ట్రాన్ని దారుణమైన పరిస్థితులకు జగన్ తీసుకెళ్ళారని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.
పొత్తులపై రేపటికల్లా పూర్తి స్పష్టత: తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు దిల్లీ నుంచి పిలుపు వచ్చింది కాబట్టి వెళ్తున్నారని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు స్పష్టంచేశారు. దిల్లీ పెద్దల్ని కలిశాక పొత్తులు, ఇతర అంశాలపై స్పష్టత వస్తుందని తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ రాత్రికి దిల్లీ చేరుకుంటారని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. పొత్తులపై రేపటికల్లా పూర్తి స్పష్టత వస్తుందని భావిస్తున్నామన్నారు. తమ పొత్తుల్ని విచ్ఛిన్నం చేయటానికి ఓ వర్గం మీడియా చేసిన తీవ్ర ప్రయత్నాలు బెడిసికొట్టాయని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
'వైసీపీ పాలన నుంచి ప్రజలను కాపాడేందుకే టీడీపీ-జనసేన పార్టీల కలయిక'
జనసేన నేతల ఇళ్లలోకి పోలీసులు: చిలకలూరిపేట సభ సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. క్షేత్రస్థాయిలో వివిధ కమిటీలు వేసుకుని కలసికట్టుగా సభను విజయవంతం చేస్తామని వెల్లడించారు. సభలో అభివృద్ధి ప్రణాళికను ప్రకటిస్తామని తెలిపారు. నిన్న రాత్రి జనసేన నేతల ఇళ్లలోకి పోలీసులు చొరబడటం దుర్మార్గమని నాదెండ్లమనోహర్ అన్నారు. నియంత పాలన ప్రజాస్వామ్యంలో మంచిది కాదని ఆయనహితవుపలికారు. వీలైతే ఏదైనా వస్తువులు జనసేన సిబ్బంది ఉన్న చోట పెట్టి అక్రమంగా అరెస్టు చేయాలని చూసారని మండిపడ్డారు. పోలీసు యంత్రాంగాన్ని ప్రతిపక్షాలపై కక్షసాధింపు కోసమే పెట్టడం దుర్మార్గమని నాదెండ్ల మనోహర్ దుయ్యబట్టారు.
'అరాచక పాలనను అంతమొందించేందుకు టీడీపీ-జనసేన కలిసి పని చేయాలి'