తెలంగాణ

telangana

ETV Bharat / state

తిరమలలో వైకుంఠ ద్వార దర్శనాలు - 17వ తేదీన దర్శనానికి టోకెన్ల జారీ - VAIKUNTA DWARA DARSHAN IN TIRUMALA

ఉత్సాహంగా కొనసాగుతున్న వైకుంఠ ద్వారా దర్శనాలు - పెద్ద ఎత్తున కుటుంబ సమేతంగా తరలివస్తున్న భక్తులు - వివిధ ప్రాంతాల్లో టోకెన్లను జారీ చేస్తున్న టికెట్‌ కేెంద్రాలు

TIRUMALA TIRUPATI
VAIKUNTA DWARA DARSHANAM (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 15, 2025, 3:28 PM IST

Vaikunta Dwara Darshan in Tirumala : తిరుమల కొండపై కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడి వైకుంఠ ద్వార దర్శనాలు ఘనంగా కొనసాగుతున్నాయి. నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుపతికి వచ్చి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. జనవరి 10న ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు 19వ తేదీ వరకు సరిగ్గా తొమ్మిది రోజులు కొనసాగనున్నాయి. ఈ సంక్రాంతి సెలవులు కావడంతో పెద్ద ఎత్తున భక్తులు కొండపైకి తరలి వస్తున్నారు. దీంతో ఎలాంటి ఇబ్బందులూ కలుగకుండా టీటీడీ అధికారులు అన్ని రకాల సౌకర్యాలు, ఏర్పాట్లు చేశారు. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన వివిధ కేంద్రాల వద్ద టోకెన్లను మంజూరు చేస్తున్నారు. ఈ నెల 17వ తేదీకి సంబంధించిన టోకెన్లను టీటీడీ సిబ్బంది భక్తులకు ఈరోజు బుధవారం జారీ చేస్తున్నారు.

వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ కేంద్రాలు :విష్ణునివాసం కాంప్లెక్స్‌, భూదేవి కాంప్లెక్స్‌,శ్రీనివాసం కాంప్లెక్స్‌, ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి వద్ద ఏర్పాటు చేసిన సెంటర్లలో భక్తులకు టోకెన్లను ఇస్తున్నారు. వీటితో పాటుగా భైరాగి పట్టెడలోని రామానాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్‌ పల్లిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, జీవకోనలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో ప్రత్యేక కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. అదే విధంగా తిరుపతిలోని స్థానికుల కోసం ప్రత్యేకంగా తిరుమల బాలాజీ నగర్‌ కమ్యూనిటీ హాల్‌లో టికెట్లను అందజేస్తున్నారు. ఇక జనవరి 13 నుంచి 19వ తేదీ వరకు వరుసగా 7 రోజుల పాటు ఏరోజుకు ఆ రోజు ముందస్తుగా టోకెన్లను టీటీడీ జారీ చేస్తోంది.

స్పెషల్‌ దర్శనాలు రద్దు : భక్తులకు ఈ టోకెన్లను తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్‌లో మాత్రమే జారీ చేయనున్నారు. టోకెన్లు పొందిన భక్తులు మాత్రమే తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవాలని, ఇతరులను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేదే లేదని టీటీడీ స్పష్టం చేసింది. సామాన్య భక్తుల సౌకర్యం దృష్ట్యా పది రోజుల పాటు వివిధ రకాలైన సిఫార్సు లేఖలను టీటీడీ రద్దు చేసింది. అయితే ప్రొటోకాల్‌ పరిధిలో ఉన్న వీఐపీలు స్వయంగా వస్తే, వారికి మాత్రమే శ్రీవారి దర్శనం కల్పించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. చంటి పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు, ఎన్‌ఆర్‌ఐ, రక్షణ సిబ్బంది స్పెషల్ దర్శనాలను టీటీడీ రద్దు చేసిన విషయం తెలిసిందే.

కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరుడిని వైకుంఠ ద్వారం గుండా దర్శనం చేసుకుంటే ఎన్నో జన్మల పుణ్య ఫలం లభిస్తుందని భక్తుల బలమైన నమ్మకం. గత ఐదు రోజుల్లో ఏకంగా 3 లక్షల 37 వేల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నట్లు టీటీడీ తెలిపింది.

వైకుంఠ ఏకాదశికి ముసాబైన తిరుమల - స్వామిని దర్శించుకోనున్న 7లక్షల భక్తులు

అగ్గిపెట్టెలో పట్టే చీర - మీరెప్పుడైనా చూశారా?

ABOUT THE AUTHOR

...view details