TTD Kalyana Ratham Start : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్‌రాజ్‌లో జరగనున్న మహా కుంభమేళాకు తిరుమల నుంచి శ్రీవారి కల్యాణ రథం బయల్దేరింది. కల్యాణ రథానికి టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి పూజలు చేశారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఈ కుంభమేళా జరగనుంది. కల్యాణ రథం బయల్దేరిన సందర్భంగా బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడారు.
ఉత్తరప్రదేశ్ సర్కార్ కేటాయించిన 2.5 ఎకరాల స్థలంలో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటు చేసినట్లు బీఆర్ నాయుడు తెలిపారు. 170 మంది సిబ్బందితో ఆ ఆలయంలో తిరుమల తరహాలో అన్ని కైంకర్యాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉత్తరాది భక్తులకు స్వామి వారి ఆర్జిత సేవలను తిలకించే భాగ్యం కల్పిస్తామని చెప్పారు. జనవరి 18, 26 ఫిబ్రవరి 3, 12 తేదీల్లో శ్రీవారి కల్యాణోత్సవం నిర్వహిస్తామని వెల్లడించారు. కుంభమేళాను దిగ్విజయం చేసేందుకు అందరూ సహకరించాలని ఆయన కోరారు.
Maha Kumbh Mela 2025 :మరోవైపు మహా కుంభమేళ ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. ఈ సంవత్సరం జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగ్‌రాజ్‌లో ఈ మహా కుంభమేళా జరగనుంది. ఇందులో జనవరి 14 (మకర సంక్రాంతి), జనవరి 29 (మౌని అమావాస్య), ఫిబ్రవరి 3 (వసంత పంచమి)నషీహి స్నాన్ జరుగుతుంది. కనుక భారీ సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు. ఈ క్రమంలోనే ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఆధ్యాత్మిక వేడుకకు పలు బెదిరింపులు రావడంతో ఏడంచెల భద్రతా చర్యలు చేపట్టారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత సీసీ కెమెరాల ద్వారా భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు.
కాశీ వెళ్లాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం - IRCTC మహా కుంభమేళా ప్యాకేజీ
మహా కుంభమేళా పన్నెండేళ్లకు ఒకసారి మాత్రమే ఎందుకు? 'రాజ' స్నానం చేస్తే అంత మంచిదా!