TTD EO Shyamala Rao Spoke with Devotees in TTD Dial Your EO Program: తిరుమల తిరుపతి దేవస్థానం అన్నప్రసాదాల్లో నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించామని ఈవో శ్యామలరావు తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలోని మీటింగ్ హాల్‌లో జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానాలు ఇచ్చారు. శ్యామలరావు మాట్లాడుతూ శ్రీవారి లడ్డూ ప్రసాదాల రుచి, నాణ్యతను మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
పూర్ణ చంద్రశేఖర్ - మచిలీపట్నం : శ్రీవారిని దూరం నుంచి చూడటం వల్ల వయసు రీత్యా కనబడుటలేదు. వీలైనంత దగ్గరగా దర్శనం కల్పించండి. లడ్డూ ప్రసాదాల నాణ్యత పెంచేందుకు చర్యలు తీసుకోండి.
ఈవో : రద్దీ అధికంగా ఉండడం వలన దగ్గరగా దర్శనం కల్పించడం వీలు కాదు. లడ్డు ప్రసాదాల నాణ్యతను మరింత పెంచేందుకు చర్యలు చేపట్టాం.
శేఖర్ - తిరుపతి : తిరుపతి శ్రీ కోదండరామ స్వామివారి ఆలయం మూలమూర్తుల పాదాల వద్ద హనుమంతుడి విగ్రహం కనిపించేలా ఉంచండి.
ఈవో :సంబంధిత అధికారులతో మాట్లాడి ఏర్పాటు చేస్తాం.
లక్ష్మణ్ - చిలకలూరిపేట : తిరుమలలోని వసతి గదులలో ఎలుకలు ఉన్నాయి. శ్రీవారి ప్రసాదాలను తింటున్నాయి. అందువల్ల ఇంటికి తీసుకుని వెళ్లలేక పోతున్నాం.
ఈవో :మీరు వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ (Toll Free Number)కు ఫిర్యాదు చేయాలి. త్వరలోనే తనిఖీలు చేసి సమస్యలు పరిష్కరిస్తాం.
దేవానంద్ - తిరుపతి : 9 నెలల క్రితం టీటీడీలో ఏఈఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంతవరకు రాత పరీక్ష నిర్వహించలేదు.
ఈవో: త్వరలో ఏఈఈ నియమకాలను పూర్తి చేస్తాం.
విజయలక్ష్మి : టీటీడీ ట్రస్ట్‌లకు విరాళాలు ఇచ్చిన దాతలను దర్శనానికి ఎక్కడి నుంచి పంపుతారు.
ఈవో :దాతలను సుపథం నుండి శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు.
చంద్ర కిరణ్ - ప్రకాశం జిల్లా : టీటీడీ భక్తులకు అందిస్తున్న వసతి, దర్శనం, అన్నప్రసాదాలు తదితర సౌకర్యలు బాగున్నాయి.
ఈవో : ధన్యవాదాలు, ఇటువంటి ప్రశంసలు మాకు, మా ఉద్యోగులందరికీ స్ఫూర్తిని కలిగిస్తాయి. మరింత ఉత్సాహంతో భక్తులకు మెరుగైన సేవలు అందిస్తాం.
వెంకటేశ్వర్లు - హైదరాబాద్ : శ్రీవారి ఆలయంలో తోపులాట ఎక్కువగా ఉంది. ఆడవాళ్లు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. చర్యలు తీసుకోండి.
ఈవో :టీటీడీ విజిలెన్స్ విభాగం, అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకుంటారు.
శ్రీనివాస్ - తెలంగాణ : టీటీడీ కళ్యాణ మండపాలు లీజుకు తీసుకొని ఆరు లక్షల రూపాయలు ఖర్చు చేసి ఆధునీకరించాం. మా పరిస్థితి ఏమిటి?
ఈవో : కళ్యాణ మండపాల లీజు పాలసీని పరిశీలిస్తున్నాం. మా అధికారులు మీతో మాట్లాడతారు.
సంధ్య రాణి - సూర్యాపేట : శ్రీవారి సేవకు వస్తుంటాం. ఏదైనా సమస్య వల్ల మా గ్రూప్‌లోని సభ్యులు రాలేక పోతే వేరొకరికి అవకాశం కల్పించండి.
ఈవో : వీలు కాదు.
మనోజ్ - ఛత్తీస్ ఘడ్ : సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ తదితర కేంద్ర భద్రత బలగాలకు శుభధం ద్వార దర్శనం కల్పించండి.
ఈవో : ఇప్పటికే ఉంది, పరిశీలిస్తాం.
అరుంధతి- హైదరాబాద్ : ఇటీవల ఆన్ లైన్లో సుప్రభాత సేవ దొరికింది. నేను నడవలేను. స్వామివారి దర్శనం కల్పించండి.
ఈవో :బయోమెట్రిక్ ద్వారా మీకు స్వామి వారి దర్శనం కల్పిస్తాము.
రాజేష్ - తెలంగాణ : శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు తీసుకోవడం లేదు.
ఈవో :శ్రీవారి దర్శనానికి ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన సిఫారసు లేఖలు మాత్రమే అనుమతిస్తున్నాం.
శ్రీనివాస్ - విశాఖపట్నం : పరకామణి సేవకు వస్తుంటాను. మాకు టెంపుల్ డ్యూటీ వెయ్యండి.
ఈవో :మా అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం.
శ్రీనివాస్- తెనాలి :నేను అన్నమాచార్య సంకీర్తనలను ప్రచారం చేస్తున్నాను. ప్రతి జిల్లాలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా గోవింద నామాలు, భజనలు ప్రచారం చెయ్యండి.
ఈవో :మా అధికారులు మీతో మాట్లాడి సూచనలు స్వీకరిస్తారు.
ప్రసన్నకుమార్ - విశాఖపట్నం : రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఆన్లైన్లో దొరకడం లేదు. ఎక్కడ ఏదో పొరపాటు జరుగుతోంది.
ఈవో : ఈనెల 24వ తేదీ ఆన్లైన్లో 4.5 లక్షల టికెట్లు విడుదల చేశాం. ఒక గంటలోనే అన్ని టికెట్లు అయిపోయాయి. అన్ని సేవలకు దాదాపు 20 లక్షల మంది లాగిన్ అయ్యారు. టీటీడీ ఐటీ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది. ఎలాంటి సమస్యలు లేవు.
భాస్కర్ - కడప : శ్రీనివాస మంగాపురం నుండి శ్రీవారి మెట్టుకు ఉచిత బస్సు ప్రయాణ సమయాలు, తిరుమలలో ఉచిత బస్సులు ఏఏ మార్గాల్లో ప్రయాణిస్తున్నాయి తదితర అంశాలపై డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయండి. శ్రీ శ్రీనివాస దివ్య అనుగ్రహ హోమం టికెట్లు పొందిన భక్తులకు సుపథం ద్వారా దర్శనం కల్పించండి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ రెండులో ఫ్రీ ఎంట్రీ సమాచారం ఇవ్వడం లేదు.
ఈవో : వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో రీ ఎంట్రీ సమాచారంపై బోర్డులు ఏర్పాటు చేశాం. మిగిలిన అంశాలపై చర్యలు తీసుకుంటాం.
నాగరాజన్ - నగిరి :తిరుత్తణిలో టీటీడీ స్థలము ఉంది, ఈ స్థలం ఆక్రమణలకు లోనవుతుంది. ఇందులో కళ్యాణ మండపం నిర్మించండి.
ఈవో : చర్యలు తీసుకుంటాం మా అధికారులు మీతో సంప్రదిస్తారు.
ముని లక్ష్మి - నెల్లూరు : మీరు ఈవోగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పలు మార్పులు తీసుకువచ్చారు. పీవీఆర్కే ప్రసాద్ గారు ఈవోగా ఉన్న రోజులు గుర్తుకొస్తున్నాయి. శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతికి సంబంధించి 3 నెలలకు ముందు విడుదల చేయడం వలన చాలా ఇబ్బందిగా ఉంది. ఒకటి లేదా రెండు నెలలు ముందు విడుదల చేయండి. దర్శనం టికెట్లు క్యాన్సిల్ చేసుకుని అవకాశం కల్పించండి. తద్వారా మళ్ళీ సేవా టికెట్లు పొందేందుకు అవకాశం కలుగుతుంది. ఆర్జిత సేవలు వర్చువల్ సేవలు ఒకే తేదీలో కాకుండా వేర్వేరు తేదీల్లో విడుదల చేయండి.
ఈవో :ధన్యవాదాలు, ఆర్జిత సేవలలో మార్పులు వీలు కాదు. టికెట్లు క్యాన్సిల్ చేసుకునే అవకాశం పరిశీలిస్తాం.
అలేఖ్య - తిరుపతి : టీటీడీ పుస్తక విక్రయశాలల్లో టీటీడీ ప్రచురణలు అందుబాటులో ఉంచండి.
ఈవో :తప్పకుండా.
ఈ రకంగా వెంకన్న స్వామి వారి భక్తులు ఫోన్ చేసి శ్రీవారి సేవ, దాతలు, వయో వృద్ధులు వసతి, దర్శనంనకు సంబంధించి తమ అభిప్రాయాన్ని తెలిపారు. సందేహాలను స్పష్టంగా అడిగారు. ఈఓ కొన్ని నోట్ చేసుకున్నారు. కొన్నింటికి సమాధానాలు చెప్పారు. తిరుమలకు సంబంధించిన మరిన్ని వివరాలకు https://news.tirumala.org/ను సంప్రదించండి
శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్ - సర్వదర్శనం టోకెన్లు భారీగా పెంచిన టీటీడీ - TIRUMALA NEWS UPDATE