Vijayawada Girl Excels in Karate and Kuchipudi : కృషికి పట్టుదలతో తోడైతే ఏ రంగంలోనైనా రాణించవచ్చు. ఈతరం అమ్మాయిల సక్సెస్‌మంత్ర కూడా అదే. అలానే చదువుతోపాటు రెండు భిన్నమైన రంగాల్లో రాణిస్తోన్న ఈ విజయవాడ అమ్మాయి స్టోరీ కూడా అలాంటిదే. ఇటు శాస్త్రీయ నృత్యం అటు కరాటేలో జాతీయస్థాయిలో రాణించి ప్రశంసలు అందుకుంటోంది. ఎక్కడ పోటీలకు వెళ్లినా పతకంతో తిరిగి రావాల్సిందే అనట్లుగా రాటుతేలింది. మార్షల్ ఆర్ట్స్ కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించింది. ఆ స్పెషల్ స్టోరీ మీ కోసం.
తనకంటూ ప్రత్యేక స్థానం : భరతనాట్యం, కూచిపూడిలో అక్కను ప్రేరణగా తీసుకొని అనతి కాలంలోనే వందల నృత్య ప్రదర్శనలు ఇచ్చింది. 4 ఏళ్ల వయస్సులోనే శాస్త్రీయ నృత్యంలో ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగింది. ఒక్కో మెట్టు ఎక్కుతూ చదువు, నృత్యం, కరాటేలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది ఈ బెజవాడ అమ్మాయి.
విజయవాడ దర్శిపేటకు చెందిన తోట వెంకట సుబ్బయ్య, వసంతల దంపతుల కుమార్తె రేణు శ్రీ. స్వర్ణభారతి హైస్కూలులో పదో తరగతి చదువుతున్న రేణుశ్రీ విద్యతోపాటు నృత్యం, కరాటేలో రాటుతేలింది. ఎక్కడ పోటీలు జరిగినా అవార్డులతో తిరిగి రావాల్సిందే అన్నట్లుగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
స్విమ్మింగ్‌లో సత్తా చాటుతున్న భవానీ కార్తీక్ - స్వర్ణ పతకాలతో సవాల్
ప్రముఖుల ప్రశంసలు : రాష్ట్ర, జాతీయస్థాయిలో ప్రదర్శనలతో అబ్బురపరుస్తోంది రేణుశ్రీ. కూచిపూడి కళా వైభవం ప్రదర్శించి కళాకార్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది. 2021, 2022లో జరిగిన నృత్యోత్సవంలో నర్తన మయూరి, శ్రీనటరాజ అవార్డులు కైవసం చేసుకుంది. శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల్లో రేణుశ్రీ నృత్య ప్రదర్శనకు ప్రముఖుల నుంచి ప్రశంసలు పొందింది.
"మా అక్క డాన్స్ చేయడం చూసి నచ్చి నేను డాన్స్ నేర్చుకోవడం ప్రారంభించాను. ఇప్పటివరకు చాలా చోట్ల ప్రదర్శనలు ఇచ్చాను. కరాటే నేను మూడో తరగతిలో ఉన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాను. ఇప్పుడు నేను సీనియర్, బ్లాక్‌బెల్ట్ స్టేజ్‌లో ఉన్నాను. ఇలా నేను అనుకున్నదాంట్లో రాణిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు మా తల్లిదండ్రులు ఎప్పుడూ సహాయం చేసేవారు." - శాస్త్రీయ నత్య కళాకారిణి
రేణుశ్రీ నృత్యంలో ప్రావీణ్యం కాదు యుద్ధవిద్యలో కూడా ఆరితేరింది. కరాటేలో వైట్, ఆరంజ్, గ్రీన్, వైట్ బెల్టులు దాటేసి బ్లాక్ బెల్ట్ కూడా సాధించింది. నాన్ చాక్‌తో పాటు కత్తితోనూ యుద్ధవిద్యలు నేర్చుకుంది. రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో అనేక బహుమతులు అందుకుంది.
ఎన్నో అవార్డులు : పిల్లల ఇష్టమే తమ ఇష్టంగా వారికి నచ్చిన రంగంలో ప్రోత్సహిస‌్తున్నామని చెబుతున్నారు రేణుశ్రీ తల్లి వసంత. రేణుశ్రీ చిన్నప్పటి నుంచి ఆటపాటల్లో ఉత్సాహంగా ఉండేదని అందుకే నృత్యం, కరాటేలలో చేర్పించామన్నారు. రెండు రంగాల్లోనూ రాణిస్తూ చదువులో సైతం ప్రతిభ చూపుతోందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ చదువంటూ పిల్లలను విసిగించకుండా, ఆటపాటల వైపు ప్రోత్సహించడం ఎంతో అవసరం. లేకుంటే వారిలో ఉండే ప్రతిభా నైపుణ్యాలు కనుమరుగవుతాయి. తల్లిదండ్రుల చేయూతతో ఎన్నో అవార్డులు సాధిస్తున్న రేణుశ్రీ ఇందుకు నిదర్శనం అంటున్నారు అధ్యాపకులు.
కష్టపడింది - కల నెరవేర్చుకుంది - గీతా భార్గవి విజయగాథ ఇది
'ఈ స్థాయిలో ఉండడానికి హార్డ్‌వర్క్, తల్లిదండ్రులే కారణం - ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యం'