Tirupati Vaikunta Dwaram Tickets 2025 : తిరుమల కొండపై ఘనంగా వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. నిత్యం వేలాది మంది భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకుంటున్నారు. జనవరి 10న ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు ఈనెల 19వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు కొనసాగనున్నాయి. ఈ సంక్రాంతి సెలవుల్లో పెద్ద ఎత్తున భక్తులు కొండపైకి తరలి వస్తున్నారు. దీంతో ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు మంజూరు చేస్తున్నారు. ఈ నెల 17వ తేదీకి సంబంధించిన టోకెన్లను భక్తులకు అధికారులు బుధవారం జారీ చేస్తున్నారు.
తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు ఇచ్చే కేంద్రాలు :
శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణునివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి వద్ద ఏర్పాటు చేసిన కేంద్రాల్లో భక్తులకు టోకెన్లు మంజూరు చేస్తున్నారు. వీటితో పాటు భైరాగి పట్టెడలోని రామానాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్ పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జీవకోనలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక కేంద్రాలుగా అధికారులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా స్థానికుల కోసం ప్రత్యేకంగా తిరుమల బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్‌లో టికెట్లు అందజేస్తున్నారు. ఇక జనవరి 13 నుంచి 19వ తేదీ వరకు 7 రోజుల పాటు ఏరోజూకారోజున ఒక రోజు ముందస్తుగా టోకెన్లను టీటీడీ అధికారులు అందిస్తున్నారు.
భక్తులకు ఈ టోకెన్లు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసంలో మాత్రమే జారీ చేయనున్నారు. టోకెన్లు పొందిన భక్తులు మాత్రమే తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవాల్సి ఉంటుందని, ఇతరులను అనుమతించేది లేదని టీటీడీ విజ్ఞప్తి చేసింది. సామాన్య భక్తుల సౌకర్యార్థం పది రోజుల పాటు సిఫార్సు లేఖలను టీటీడీ రద్దు చేసింది. అయితే ప్రొటోకాల్ పరిధిలోని వీఐపీలు స్వయంగా వస్తే వారికి మాత్రం శ్రీవారి దర్శనం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. చంటిపిల్లల తల్లిదండ్రులతో పాటు వృద్ధులు, దివ్యాంగులు, ఎన్‌ఆర్‌ఐ, రక్షణ సిబ్బంది స్పెషల్ దర్శనాలను టీటీడీ రద్దు చేసినట్లు ప్రకటించింది.
కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటే ఎన్నో జన్మల పుణ్య ఫలం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. గత ఐదు రోజుల్లో దాదాపు 3 లక్షల 37 వేల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు.
రైతుల పండుగ - పాడి పశువులను దైవంగా పూజించే కనుమ విశిష్టత ఇదే!
శబరిమలలో అయ్యప్పకు అభిషేకం - 13 ఏళ్ల కన్నె స్వామికి దక్కిన అదృష్టం!