Tirumala Srivari Seva Tickets With Fake Identity Cards: నకిలీ గుర్తింపు కార్డులతో శ్రీవారి సేవా టికెట్లు, వసతి గదులను తీసుకునేందుకు అక్రమార్కులు చేస్తున్న పనులను అడ్డుకునేందుకు టీటీడీ సిద్ధమైంది. ఇందుకోసం ఆధార్‌ను టీటీడీని పలుసేవలకు అనుసంధానం చేయనుంది. వివిధ సేవలకు ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో భక్తులు సమర్పిస్తున్న గుర్తింపు కార్డులు నిజమా కాదా అని తెలుసుకునే వ్యవస్థ లేకపోవడంతో కొంత మంది అక్రమాలకు పాల్పడుతున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆన్లైన్, ఆఫ్‌లైన్ సేవలపై టీటీడీ ఈఓ శ్యామలరావు సమీక్షించారు. ఐటీ విభాగంలోని కొన్ని లొసుగులను అడ్డంపెట్టుకొని చాలా అక్రమాలు జరిగినట్లు గుర్తించారు.
‘ఆధార్’తో అక్రమార్కులు : ఒకే మొబైల్ నంబరు, ఈ- మెయిల్, ఐడీతో పెద్ద మొత్తంలో బుకింగ్ జరిగినట్లుగా తేలింది. వసతి కోసం కరెంటు బుకింగ్‌లో పలు గుర్తింపు కార్డులను చూపించి గదులను తీసుకొని అధిక ధరకు ఇస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ అక్రమాలకు అడ్డుకట్టవేసేందుకు టీటీడీ సిబ్బంది వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫెషియల్ రికగ్నిషన్ వ్యవస్థతోపాటు ఆధార్ ప్రమాణాల ద్వారా వీటికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించారు.
యూఐడీఏఐ సేవలు: ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులతో యూఐడీఏఐ ప్రతినిధులు సమావేశమై సేవలకు ఆధార్ అనుసంధానం చేసే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. ఆధార్ చట్టం-2016 ప్రకారం సేవలు వినియోగించుకునే వీలుందని అన్నారు. ఇందుకు రెండేళ్లకు రిజిస్ట్రేషన్ రుసుము కింద రూ.20 లక్షలు టీటీడీ చెల్లించాల్సి ఉంటుంది. ఆధార్ గుర్తింపునకు 40 పైసలు, ఈకేవైసీకి రూ.3.40 టీటీడీ చెల్లించాల్సి ఉంటుంది. ఇటీవలె టీటీడీ ధర్మకర్తల మండలి కూడా ఆధార్ సేవలను వినియోగించేందుకు ఆమోదముద్ర వేసింది. ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసి ఆమోదముద్ర వేస్తే ఇక ఆధార్ సేవలను టీటీడీలో వినియోగించుకునే అవకాశం కలుగుతుంది.