Tirumala Brahmotsavam 2024 : అంగరంగ వైభవంగా సాగిన తిరుమల బ్రహ్మోత్సవాలు ముగిశాయి. 8 రోజులపాటు వివిధ వాహన సేవలపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. టీటీడీ గతంలో కన్నా మిన్నగా పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. దాదాపు 15 లక్షల మందికి పైగా భక్తులు స్వామివారి వాహనసేవలను తిలకించారు. అన్నప్రసాదం సహా తిరుమల లడ్డూలోనూ నాణ్యత పెరిగిందని భక్తులు అభిప్రాయపడినట్లు ఈవో శ్యామలరావు తెలిపారు.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. 8 రోజుల పాటు వివిధ వాహనసేవలపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను అలరించిన మలయప్పస్వామికి చివరి రోజు పుష్కరిణిలో చక్రస్నానం కన్నులపండువగా సాగింది. ఉదయం శ్రీవారి పుష్కరిణిలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామికి, చక్రత్తాళ్వర్కు అర్చకులు శాస్త్రోక్తంగా తిరుమంజనం నిర్వహించారు. అనంతరం పుష్కరిణిలో పవిత్ర స్నానం చేయించారు.
విజయవంతంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వాహణ- క్షేత్రస్ధాయిలో సమస్యలకు పరిష్కారిస్తాం: టీటీడీ ఈవో
ఎటువంటి పొరపాట్లుకు తావులేకుండా ముందుస్తుగా చర్యలు చేపట్టి అధికారులు విజయవంతం చేశారు. భక్తులకు పెద్దపీట వేస్తూ ఆలయంలోని పలు ఆర్జిత సేవలను ఏకాంతంగా టీటీడీ నిర్వహించింది. ప్రముఖుల సిఫార్సు లేఖల దర్శనంతో పాటు పలు ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఇవాళ ఉదయం బ్రహ్మోత్సవాల్లో ఆఖరి ఘట్టమైన చక్రస్నానంను శాస్త్రోక్తంగా అర్చకులు నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు శ్రీవారి పుష్కరిణిలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి, చక్రత్తాళ్వర్కు అర్చకులు శాస్త్రోక్తంగా తిరుమంజనం నిర్వహించారు. అనంతరం చక్రత్తాళ్వరుకు అర్చకులు పుష్కరిణీలో పవిత్ర స్నానం చేయించారు.
తరువాత భక్తులు పుష్కరిణీలో పుణ్యస్నానాలు ఆచరించడంతో వేడుకగా బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అయ్యాయి. ఎలాంటి పొరపాట్లుకు తావులేకుండా బ్రహ్మోత్సవాలను ఘనంగా ముగించినట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. వాహన సేవలను 15 లక్షల మంది భక్తులు వీక్షించారని ఆయన వివరించారు. గత అనుభవాల దృష్ట్యా పకడ్బందీగా ప్రణాళికలు రచించామన్నారు. ఎప్పటికప్పుడు భక్తుల నుంచి సూచనలు, సలహాలు తీసుకుని తదననుగుణంగా ఏర్పాట్లు చేశామన్నారు.
సాధారణ భక్తులు సంతృప్తి స్ధాయిలో వాహన సేవలో ఉత్సవ మూర్తులను, మూల విరాటును దర్శించుకునే వీలుగా ఏర్పాట్లు చేశామని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు పోలీసులు, టీటీడీ సమన్వయంతో విజయవంతమయ్యాయని తెలిపారు. భక్తులకు సేవలందించడంలో భాగంగా క్షేత్రస్ధాయి పర్యటనలతో కొన్ని సమస్యలు గుర్తించామని రాబోయే రోజుల్లో వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతమయ్యేలా సూక్ష్మస్ధాయి ప్రణాళికలు రూపొందించి అమలు చేశామన్నారు.
కనులపండువగా శ్రీవారి మహా రథోత్సవం - వైభవంగా స్వామి వారి బ్రహ్మోత్సవాలు