Woman Arrested In Murder Case In YSR District: వైయస్సార్ జిల్లా జమ్మలమడుగులో కళ్లలో కారం కొట్టి వ్యక్తిని హత్య చేసిన ఘటనలో నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసు సబ్ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు వివరాలను వెల్లడించారు.
యర్రగుంట్ల మండలం చిలమకూరులో శివరామిరెడ్డికి అరుణతో సుమారు రెండేళ్ల నుంచి అక్రమ సంబంధం ఉండేది. అదే మహిళ సంవత్సరం నుంచి తన ఇంటి ఎదురుగా ఉన్న ఆదెన్న అనే వ్యక్తితో సైతం అక్రమ సంబంధం నడిపేదని పోలీసులు తెలిపారు. ఈ విషయంపై శివరామిరెడ్డి, అరుణ- ఆదెన్నలను తీవ్రంగా మందిలించినట్లు చెప్పారు. దీంతో మనసులో కక్ష పెట్టుకున్న ఇద్దరు, ఎలాగైనా శివరామిరెడ్డిని చంపాలని పథకం వేశారు.
ఈ నెల 15వ తేదీన అరుణ తన ఇంటికి రమ్మని శివరామిరెడ్డిని పిలిపించుకుంది. ఆయన ఇంట్లోకి రాగానే కళ్లల్లో కారం చల్లి, తాడుతో మెడను బిగించి చంపేసింది. అనంతరం శవాన్ని ఎవరు చూడకుండా అక్కడ నుంచి ఒక ఆటోలో తీసుకుని తొండూరు మండలం మల్లెల ఘాట్ లో పారవేశారన్నారు. అనంతరం శివరామి రెడ్డి సెల్ఫోన్, చెప్పులు, అతని మెడకు వేసి చంపిన తాడును కాల్చి బూడిదను కాలువలో పడవేశారన్నారు. మృతుడు శివరామి రెడ్డి భార్య రామ లక్షమ్మ ఫిర్యాదు మేరకు యర్రగుంట్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకున్నారు. నిందితురాలు అరుణను విచారించగా హత్య చేసిన విషయం అంగీకరించిందని తెలిపారు. మరో నిందితుడు ఆదెన్న ప్రస్తుతం పరారీలో ఉన్నాడని త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
''శివరామి రెడ్డి (మృతుడు) భార్య రామ లక్షమ్మ ఫిర్యాదు మేరకు యర్రగుంట్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అందుకు గాను అనుమానితురాలిగా అరుణను (నిందితురాలు) విచారించాం. కానీ ఆమె మొదట్లో ఏమీ తెలీదని చెప్పింది. తరువాత విచారణ జరుగుతున్న కొద్దీ ఈమే హత్య చేసినట్లు రుజువైంది. గతంలో శివరామిరెడ్డితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అదే విధంగా తరువాత అదే మహిళ సంవత్సరం నుంచి తన ఇంటి ఎదురుగా ఉన్న ఆదెన్న అనే వ్యక్తితో సైతం అక్రమ సంబంధం నడిపేదని విచారణలో తేలింది. ఈ విషయంపై శివరామిరెడ్డి అరుణ, ఆదెన్నను తీవ్రంగా మందిలించారు.దీంతో మనసులో కక్ష పెట్టుకున్న ఇద్దరూ ఎలాగైనా శివరామిరెడ్డిని చంపాలని పథకం వేసి చంపేశారు''-వెంకటేశ్వరరావు, డీఎస్పీ జమ్మలమడుగు