Leopard Roaming SVV University in Tirupati: ఇటీవల కాలంలో జనావాసాల్లోకి చిరుతల సంచారం ఘటనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీంతో ప్రజలంతా ఏ పక్క నుంచి ఏ ప్రమాదం వాటిల్లుతుందోనని బిక్కు బిక్కుమంటూ తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. తాజాగా తిరుపతి శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయ ఆవరణలో చిరుత సంచారం మరోసారి కలకలం రేపింది. విశ్వవిద్యాలయ వసతి గృహాల వద్ద చిరుత సంచారంతో విద్యార్థులంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వివరాల్లోనికి వెళ్తే
అసలేమైందంటే? గత నెలన్నరగా శ్రీ వేంకటేశ్వర వేద విశ్వ విద్యాలయం, అలిపిరి జూ పార్క్ ప్రాంతాల్లో తరచూ చిరుత సంచరిస్తోంది. గత పదిరోజుల క్రితం వసతి గృహాల వద్ద చిరుత సంచరించింది. ఇనుప కంచె అడ్డు ఉండటంతో ఉండడంతో లోనికి ప్రవేశించడానికి వీలుకాక అక్కడే మాటు వేసింది. మరోసారి ఇవాళ విద్యార్థుల వసతి గృహాల వద్ద రాత్రి చిరుత పులి సంచారంతో విద్యార్ధులు భయాందోళనకు గురయ్యారు. బోన్లు ఏర్పాటు చేసినప్పటికీ చిరుత దొరకకపోవడంతో రాత్రి వేళల్లో భద్రతను మరింత పెంచాలని విద్యార్థులు, ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Leopard Comes Up Road At Science Center Near Tirupati Zoo Park: నెలరోజుల క్రితం జరిగిన మరో ఘటనలో తిరుపతి జూపార్క్ సమీపంలోని సైన్స్ సెంటర్ వద్ద రోడ్డు పైకి చిరుత పులి రావడంతో ద్విచక్రవాహనం నుంచి ఓ వ్యక్తి క్రింద పడి గాయాలపాలయిన ఘటన చోటు చేసుకుంది. బైక్ నుంచి పడిన వెంటనే అక్కడ ఉన్న కొంతమంది రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. గాయపడిన వ్యక్తి టిటిడి అశ్విని మెడికల్ హాస్పిటల్ లో పనిచేస్తున్న ముని కుమార్ గా పోలీసులు గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు సంఘటనా స్ధలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో అలిపిరి నుంచి జూ పార్క్ రోడ్డు వైపు ప్రయాణించే వారు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు.