Polavaram Twin Tunnel Works : కూటమి సర్కార్ రాకతో పోలవరం ప్రాజెక్టు పనులు పట్టాలెక్కడంతో ప్రాజెక్టులో కీలక ఘట్టాలకు అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలో ప్రధాన డ్యాంతో కుడి కాలువను అనుసంధానించే పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. భవిష్యత్ అవసరాల మేరకు నీటి ప్రవాహ సామర్థ్యం ఉండేలా రెండు సొరంగాల వ్యాసాన్ని వెడల్పు చేస్తున్నారు. గతంలో ఒక్కో టన్నెల్‌ను 10,000ల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో తవ్వారు. ప్రస్తుతం దాన్ని రెట్టింపు చేసేలా పనులు ప్రారంభించారు. గోదావరి వరద జలాలను వినియోగించుకునేందుకు ఇప్పటికే పోలవరం- బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ అనుసంధానంపై ఏపీ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఇందుకు మొదటి దశలో కృష్ణా నది మీదుగా నీటిని ఏదాటించేందుకు పోలవరం వద్ద ఎలాంటి ఎత్తిపోతల అవసరం లేకుండానే ఈ టన్నెళ్ల సామర్థ్యం పెంపు వల్ల లభిస్తుంది.
కుడి కాలువ, తాడిపూడి కాలువను వెడల్పు చేసి తరలించే వరద నీటిని బొల్లాపల్లి వద్ద నిర్మించే జలాశయానికి చేర్చాలన్న ఆలోచన ఉంది. కుడి కాలువ అనుసంధానంలో భాగంగా హెడ్ రెగ్యులేటర్, శాడిల్ డ్యాం ఈ, ఎఫ్ ప్యాకేజీలు, జంట సొరంగాలు, వాటి లోపలికి నీటిని మళ్లించి, వెలుపలకు పంపించే ఛానళ్ల నిర్మాణ పనులు చేపట్టారు. వీటితో పాటు రెండు కట్టలు, స్టిల్లింగ్ బేసిన్ నిర్మించి కుడి ప్రధాన కాలువ సున్నా కిలోమీటరు వద్ద ఓటీ రెగ్యులేటర్ ఏర్పాటు చేయాలి. 2027 డిసెంబర్‌లోగా ఈ పనులన్నీ పూర్తిచేయాల్సి ఉంటుంది. తద్వారా పోలవరం రిజర్వాయర్‌లో నీటిని నింపిన తర్వాత కుడి కాలువకు గ్రావిటీ ద్వారా మళ్లించవచ్చు. కుడి అనుసంధాన పనుల్లో ఫ్లాంక్ రెగ్యులేటర్, శాడిల్ డ్యాం ఈ, ఎఫ్ పనులు పూర్తికాగా, 62వ ప్యాకేజీ పనులు దాదాపు పూర్తయ్యాయి.
సొరంగాల సామర్థ్యం పెంపు :
- 63వ ప్యాకేజీలో భాగంగా 900 మీటర్ల పొడవున జంట సొరంగాలు తవ్వుతున్నారు. మొదట్లో అనుకున్న దానికంటే సామర్థ్యం పెంచాలని 2021లో నిర్ణయం తీసుకున్నారు. మొదట ఈ పనిని రూ.72.81 కోట్లతో చేపట్టారు. 2019లో అదనపు ధరలు వర్తింపజేసి, రూ.99.28 కోట్లకు అనుబంధ ఒప్పందం కుదుర్చుకున్నారు. తర్వాత టన్నెల్ వెడల్పు కోసం మరో రూ.103.56 కోట్లతో సర్కార్ పాలనామోదం ఇచ్చింది. మొత్తం రూ.204.79 కోట్ల విలువైన పనిలో సగం పూర్తయింది. జంట సొరంగాల తవ్వకంలో మట్టి తీత పనులు 88 శాతం పూర్తయ్యాయి.
- ఎగ్జిట్ ఛానల్‌లో 425 మీటర్లకు 150 మీటర్ల పని పూర్తయింది. ఎంట్రీ ఛానల్‌లో ఎడమ వైపు దాదాపు పూర్తిచేశారు. కుడి వైపున 108 మీటర్లకు గాను 90 మీటర్ల పని పూర్తయింది.
- 64వ ప్యాకేజీలో భాగంగా జంట సొరంగాల్లో సగం తవ్వకం పూర్తయింది. 2021లో ఈ జంట సొరంగాల సామర్థ్యం పెంచేలా రూ.107.81 కోట్లతో పాలనామోదం ఇచ్చారు. మొత్తం రూ.221 కోట్ల విలువైన పనుల్లో ఇంకా రూ.140 కోట్ల విలువైన పనులు చేయాల్సి ఉంది.
వరద జలాలు వాడుకునేలా : జంట సొరంగాల సామర్థ్యం పెంపుతో ఆ అదనపు పనులకు తాము నిధులు ఇవ్వబోమని పోలవరం అథారిటీ, కేంద్రం మొదటి నుంచీ చెబుతున్నాయి. జగన్ సర్కార్ హయాంలో ఈ పనులకు కూడా నిధులు సాధించేలా ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందుకు మళ్లీ డీపీఆర్ కావాలని కేంద్ర జలసంఘం అడిగింది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుకు డీపీఆర్ ఆమోద ప్రక్రియ పూర్తైనందున ఇక ఆ దిశగా ప్రయత్నాలు నిలిపివేశారు. రాష్ట్ర అదనపు అవసరాల రీత్యా, వరద జలాలు వాడుకునే లక్ష్యంతో సొరంగాలు తవ్వుతున్నారు.
పోలవరం డయాఫ్రం వాల్ నిర్మాణానికి 'ఆఫ్రి' ప్రత్యేక డిజైన్
కేంద్ర బడ్జెట్‌లో పోలవరానికి నిధులు - ఏపీకి కేటాయింపులు ఎలా ఉన్నాయంటే?