Tips to Reduce Online Gaming Habit in Children: ప్రస్తుత రోజుల్లో స్కూల్, కాలేజీ నుంచి రావడం ఆలస్యం పిల్లలు చేసే మొదటి పని ఫోన్ చేతిలోకి తీసుకోవడం. ఫేస్బుక్, ఇన్‌స్టా అంటూ గంటల తరబడి ఫోన్ చూసుకుంటూ ఉండిపోతున్నారు. వీటితో పాటు పర్సనల్ కంప్యూటర్లు, గేమింగ్ కన్సోల్స్ ప్లాట్‌ఫామ్‌లలోని ఆన్‌లైన్ గేమ్స్‌కు అడిక్ట్ అయిపోతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న గేమింగ్ కంపెనీలు పిల్లలపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఇది వారిలో మానసిక సమస్యలకు, తల్లిదండ్రుల సొమ్మును దొంగచాటుగా ఆన్‌లైన్ ఆటలకు ఊడ్చేసే పరిస్థితికి దారితీస్తోందని నిపుణులు అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా 10-19 ఏళ్ల వయసు పిల్లల్లో 1.3% మంది ఆన్‌లైన్ ఆటలకు బానిసలుగా మారగా, భారత్‌లో అలాంటి వారు 19.9 శాతం మంది ఉన్నట్లు ఇటీవల ఓ పరిశోధనలో వెల్లడైంది. ఈ క్రమంలోనే పిల్లలు ఆడుతున్న గేమ్స్‌పై తల్లిదండ్రులు ఓ కన్ను వేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
పిల్లలు తమ ఆన్‌లైన్ కార్యకలాపాల గురించి గోప్యత పాటించడం, తమ వద్దకు పేరెంట్స్ వచ్చిన వెంటనే స్క్రీన్‌లను మార్చడం, సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ సమయం ఉండటం, ఎలక్ట్రానిక్ ఉపకరణాల్లో కొత్త ఫోన్ నంబర్లు లేదా ఈ-మెయిల్‌లు విపరీతంగా పెరగడం లాంటివి జరిగినప్పుడు తల్లిదండ్రులు అప్రమత్తం కావాలని చెబుతున్నారు.
పిల్లలతో ఎప్పుడూ ఫ్రెండ్లీగా ఉండాలని, అలాంటప్పుడే ఏదైనా చిన్న తప్పిదం జరిగినా తల్లిదండ్రులతో వారు పంచుకుంటారని సైకాలజిస్ట్ డాక్టర్ గీత చల్లా అంటున్నారు. ఇలా ఫ్రీగా ఉండటం వల్ల ఆన్‌లైన్ గేమింగ్‌లో బ్లాక్‌మెయిల్ బారిన పడినా చెప్పుకోగలుగుతారని, లేదంటే పరిస్థితి ప్రమాదకరంగా మారే వరకు తెలియదని చెబుతున్నారు. అలాగే పిల్లలను కళలు, సాహిత్యం, భౌతిక క్రీడల్లాంటి వైపు మొగ్గుచూపేలా చేయాలని సూచిస్తున్నారు.
గేమింగ్ కన్సోల్స్‌పై నిఘా ఇలా: గేమింగ్ కన్సోల్స్‌లో పేరెంటల్ కంట్రోల్‌లను యాక్టివేట్ చేయడం ద్వారా పిల్లల ఆన్‌లైన్ గేమింగ్ కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షించే అవకాశముంది. ప్రముఖ గేమింగ్ కన్సోల్స్ అయిన ప్లే స్టేషన్, నిన్టెండో స్విచ్, ఎక్స్ బాక్స్‌లలో పేరెంటల్ కంట్రోల్‌లను యాక్టివేట్ చేయడంపై తల్లిదండ్రులకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్‌బీ) సామాజిక మాధ్యమాల ద్వారా అవగాహన కల్పిస్తోంది.