తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓవైపు చిరుత - మరోవైపు పెద్ద పులి - క్షణక్షణం భయం భయంగా గడుపుతున్న గ్రామస్థులు

లక్షెట్టిపేట అటవీ క్షేత్ర పరిధిలో పులుల సంచారం - గొర్రెల మందపై, ఆవులపై పెద్ద పులి దాడి - భయాందోళనలకు గురవుతున్న గ్రామ ప్రజలు

Tiger In Lakshettipet
Tiger Wandering In Lakshettipet Forest Area (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 7, 2024, 10:24 AM IST

Tiger Wandering In Lakshettipet Forest Area: మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట అటవీ క్షేత్ర పరిధిలో పులుల సంచారం దగ్గరి గ్రామాల ప్రజలకు, ఇటు అటవీ అధికారులకు కునుకు లేకుండా చేస్తోంది. పది రోజుల నుంచి లక్షెట్టిపేట మండలం హన్మంతుపల్లి, హాజీపూర్‌ మండలం ధర్మారం బీట్‌ పరిధిలో పెద్దపులి సంచరిస్తుందని వాటి పాదముద్రల ఆధారంగా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఇదే క్రమంలో హాజీపూర్‌ మండలం బుగ్గగుట్ట అటవీ ప్రాంతంలో గత నెల 27న అనూహ్యంగా చిరుత పులి గొర్రెల మందపై దాడి చేసింది. ఈ దాడిలో రెండు గొర్రెలు మరణించినట్లు అటవీ శాఖ అధికారులు ప్రకటించారు. తాజాగా ఆదివారం అటవీ పరిధిలోని మేడారం సెక్షన్‌లో మేతకు వెళ్లిన ఆవులపై పెద్ద పులి దాడి చేసి ఆవులను చంపడం కలకలం రేపింది.

అప్రమత్తమైన అధికారులు : లక్షెట్టిపేట పరిధిలో వన్యమృగాల సంచారం నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు జాగ్రత్తపడుతున్నారు. పులుల కదలికలు గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తూనే అక్కడి ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. పులి సాధారణంగా వెళ్లిన దారిగుండా తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటి కదలికలను గుర్తించే పనిలో పడ్డారు. మరోవైపు వాటి రక్షణ కోసం తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పులుల దాడుల నేపథ్యంలో శివారు గ్రామాల ప్రజలు భయపడుతున్నారు. ఇప్పటికే పెద్దపులి సంచారంతో శివారు గ్రామాల ప్రజలు, పశువుల కాపరులు అటవీ ప్రాంతానికి వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారు. తాజాగా చిరుత పశువులపై చేస్తున్న దాడులు గ్రామస్థులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి.

పాదముద్రల ఆధారంగా: గత నెల గొర్రెల మందపై దాడి చేసింది తొలుత పెద్దపులిగా గ్రామస్థులు అనుమానించినా, చివరకు అటవీశాఖ అధికారులు పాదముద్రల ఆధారంగా అది చిరుతపులిగానే ధ్రువీకరించారు. జన్నారం అటవీ ప్రాంతం నుంచి వచ్చిన పెద్దపులి రెండు వారాలుగా లక్షెట్టిపేట అటవీ క్షేత్ర పరిధిలో సంచరిస్తున్నట్టు అటవీ శాఖ అధికారులు ఇప్పటికే గుర్తించారు. తాజాగా సోమవారం ఉదయం హాజీపూర్‌ మండలం ధర్మారం బీటు పరిధిలో పెద్దపులి సంచరిస్తున్నట్టు దాని పాదముద్రల ఆధారంగా అధికారులు గుర్తించారు. ధర్మారం బీట్‌ నుంచి అది కుమురం భీం ఆసిఫాబాద్‌ అడవుల్లోకి వెళ్తుందని భావించినా, తిరిగి ఈ ప్రాంతంలోనే తచ్చాడుతున్నట్టు అధికారులు నిర్ధారణకు వచ్చారు.

పులిరా పులిరా మగ పులిరా - తాడోబా అడవుల్లో తిరుగుతుందిరా - Tiger Wandering In Kagaznagar

బాబోయ్​ పులులు - భయాందోళనతో ప్రజలకు నిద్ర కరవు - LEOPARDS MIGRATION IN NANDYALA

ABOUT THE AUTHOR

...view details