Tiger Roaming in Komaram Bheem Asifabad : తాడోబా అభయారణ్యాల నుంచి 25 రోజుల కిందట కాగజ్‌నగర్ అటవీ ప్రాంతానికి వచ్చిన ఎస్-12 పులి జనావాసాలకు అతి దగ్గరగా సంచరిస్తుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. మూడున్నర ఏళ్ల వయసున్న మగ పులి కాగజ్ నగర్ మండలం అంకుసాపూర్ అటవీ ప్రాంతాల్లో కొద్దిరోజులుగా తిరుగుతోంది.
కాగజ్‌నగర్‌లో పులి కదలికలు :రెండు రోజుల కిందట కనర్గాం, గుండి, పెద్దవాగు దాటి ఆసిఫాబాద్ పట్టణానికి కిలో మీటరు దూరంలో ఉన్న గోవిందపూర్ గ్రామ సమీపంలోని పంట చేలల్లో కనిపించింది. తాజాగా తిర్యాణి మండలం ఎదులపహాడ్ అడవుల సమీపంలో అధికారులకు పులి కదలికలు కనిపించాయి. ఈ నేపథ్యంలో అటవీ అధికారుల బృందం ఈ ప్రాంతంలో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు.
పరిసర గ్రామాల ప్రజలను అధికారులు నిరంతరం అప్రమత్తం చేస్తున్నారు. ఒంటరిగా అటవీ ప్రాంత సమీపంలోని చేలకు వెళ్లకూడదని సూచిస్తున్నారు. ఎదుల పహాడ్ నుంచి ఈ పులి రెబ్బెన మీదుగా దహెగాం మండలానికి వెళ్తుందా? అటు నుంచి కవ్వాల్‌కు వెళ్తుందా? అనే కోణంలో అధికారులు పులి అడుగు జాడలను అనుసరిస్తున్నారు. దహెగాంతో పాటు, కవ్వాల్‌కు వెళ్లాలన్నా పులి మళ్లీ నాలుగు వరుసల రహదారిని దాటాల్సి ఉంటుంది.
కుమురం భీం జిల్లాలో మహారాష్ట్ర పులి - ఒంటరిగా వెళ్లేందుకు జంకుతున్న అటవీ ప్రాంతవాసులు