Illegal Transportation of Ganja :తెలంగాణ ఛత్తీస్‌గఢ్ ఒడిశా సరిహద్దు ప్రాంతమైన భద్రాచలంలో గంజాయి అక్రమ రవాణాదారులు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. ద్విచక్ర వాహనంపై అక్రమంగా గంజాయి తరలిస్తున్న వాహనాన్ని ఆపేందుకు యత్నించిన పోలీసును ఢీకొట్టి నిందితులు పరారైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
ఇదీ జరిగింది :గత కొన్ని రోజులుగా ఒడిశా-ఛత్తీస్‌గఢ్ వైపు నుంచి భద్రాచలం మీదుగా కొందరు గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం. అలా తరలించిన గంజాయిని హైదరాబాద్, మహారాష్ట్ర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ భద్రాచలంలో 24 గంటల పాటు బ్రిడ్జి సెంటర్ చెక్‌పోస్టు వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
పోలీస్‌ను ఢీకొట్టి పరారైన దండగులు :ఈ క్రమంలోనే శనివారం ముగ్గురు యువకులు ద్విచక్ర వాహనంపై అక్రమంగా గంజాయిని తరలిస్తుండగా, బ్రిడ్జి సెంటర్ చెక్‌పోస్టు వద్ద ఓ కానిస్టేబుల్ ఆ బైక్‌ను ఆపేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీస్‌ను ఒక్కసారిగా ద్విచక్ర వాహనంతో ఢీకొట్టి మరీ దుండగులు పరారయ్యారు. ఈ ఘటనలో పోలీస్ అక్కడికక్కడే రహదారిపై పడిపోవడంతో స్వల్ప గాయాలు అయ్యాయి. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డవగా, అవి కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి.