Three Boys Drown in Krishna River in Guntur District: కృష్ణానదిలో ఇసుక గుంతలు ముగ్గురు బాలుర జీవితాలను బలితీసుకున్నాయి. సరదాగా గడిపేందుకు నదిలోకి వెళ్లిన ముగ్గురు విద్యార్థులు నీటిలో మునిగి మృతిచెందిన విషాద ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సకాలంలో పోలీసులు, అంబులెన్సు రాకపోవడంతో మృతదేహాలను ద్విచక్రవాహనాలపైనే కుటుంబ సభ్యులు ఒడ్డుకు చేర్చారు.
ఆదివారం సెలవు రోజు మూడు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. విజయవాడలోని పటమటకు చెందిన గగన్, తన స్నేహితులు ప్రశాంత్, కార్తీక్, షేక్ షారుఖ్‌లతో కలిసి సరదాగా గడిపేందుకు యనమలకుదురు సమీపంలోని కృష్ణా నదికి వెళ్లారు. అక్కడ ఒడ్డున కొద్దిసేపు ఫొటోలు దిగారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రశాంత్, కార్తీక్, గగన్ నీటిలోకి దిగారు. సరిగా అక్కడే గుంత ఉండడంతో ఒక్కసారిగా అందులోకి కూరుకుపోయారు.
Three People Dead in Krishna River: ఈత రాకపోవడంతో సహాయం చేయాలని కేకలు వేయగా, ఒడ్డున ఉన్న షారూఖ్ వారిని కాపాడేందుకు ప్రయత్నించాడు. సాధ్యం కాకపోవడంతో సమీపంలో ఉన్న జాలర్లకు విషయం చెప్పాడు. వారు అక్కడికి చేరుకుని ముగ్గురినీ కర్రలతో లాగేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. చివరికి వల వేసి వెలికి తీసినా.. అప్పటికే వారు మరణించారు. విగతజీవులుగా మారిన బిడ్డలను చూసి కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.