Mobile Phones Thefts in Hyderabad :హైదరాబాద్‌కు చెందిన ఓ బాధితుడు ఫోన్ పోగొట్టుకున్నాడు. పాతఫోన్ అని పట్టించుకోలేదు. మరుసటి రోజు మరో ఫోన్‌లో పాత నెంబర్‌తో సిమ్‌కార్డ్ వేసి చూడగా డిజిటల్ చెల్లింపుల యాప్‌లు చూసుకోగా బ్యాంకు ఖాతాలోని 9 వేలు ఓ పెట్రోల్ బంక్‌లోని ఖాతాకు బదిలీ చేసినట్లు కనిపించడంతో అవాక్కయ్యాడు. ఆరా తీయగా ఫోన్ దొంగిలించిన వ్యక్తి, ఆ పని చేసినట్లు తెలుసుకున్నాడు. సెన్‌ఫోన్లు చోరీలు చేస్తున్న నేరగాళ్లు, తెలివిగా వాటిలోని యూపీఐ యాప్‌ల నుంచి ఖాతాల్లోని సొమ్ముకాజేస్తున్నారు.
రహస్యంగా ఉంచాల్సిన యూపీఐ రహస్య పిన్‌ను కాంటాక్ట్ జాబితాలో సేవ్ చేయడం ఫోన్ పోయిన వెంటనే సిమ్, బ్యాంకు ఖాతాలు బ్లాక్ చేయకపోవడం ఖాతాల్లోని డబ్బుపోవడానికి ప్రధాన కారణమని పోలీసులు చెబుతున్నారు. ఫోన్ పోగొట్టుకున్నా చోరీ జరిగినా ఖరీదైన కొన్ని ఫోన్లు మినహా సాధారణ సెల్‌ఫోన్లు అన్‌లాక్ చేయడం తేలిక. నగరంలోని చాలా చోట్ల సెల్‌ఫోన్ దుకాణాదారులు ఫోన్లను అన్‌లాక్ చేసి కొత్త సెక్యూరిటీ కోడ్‌లు పెట్టడం వంటివి క్షణాల్లో చేసేస్తున్నారు. ఆ తర్వాత నేరగాళ్లు ఫోన్‌లోని యూపీఐ యాప్‌లను డిలీట్ చేస్తున్నారు.
సిమ్‌కార్డు ఫోన్‌లోనే ఉండడంతో మళ్లీ యూపీఐ యాప్‌లు డౌన్‌లోడ్ చేసి ఆ డబ్బుతో ఖరీదైన వస్తువులు కొనుగోలు చేయడం లేదా ఇతరులకు డబ్బు బదిలీ చేసి నగదు తీసుకోవడం వంటివి చేస్తున్నారు. అదంతా గంటల వ్యవధిలోనే జరుగుతోంది. భవిష్యత్‌లో సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫోన్ పోగొట్టుకున్నా, చోరీ అయినా ఆలస్యం చేయకుండా బ్యాంకు ఖాతాను తాత్కాలికంగా నిలిపి వేయించాలని చెబుతున్నారు. గూగుల్‌పే, ఫోన్‌పే, ఇతర డిజిటల్ చెల్లింపుల యాప్‌లను వెంటనే బ్లాక్ చేయాలని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీఈఐఆర్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.