తెలంగాణ

telangana

ETV Bharat / state

ముసుగు ధరించి వచ్చిన దుండగులు - తుపాకులు, కత్తులతో బెదిరించి చేతులు కట్టి అపహరణ - GOLD ROBBERY IN HYDERABAD

నగర నడిబొడ్డు దోమలగూడ ప్రాంతంలో దోపిడీ కలకలం - సినీ ఫక్కీలో జరిగిన దోపిడీలో 2.5 కిలోల బంగారం చోరీ - ఇంట్లోని సీసీ కెమెరాల డీవీఆర్‌ను ఎత్తుకుపోయిన దుండగులు

Gold Robbery in Domalguda Hyderabad
Gold Robbery in Domalguda Hyderabad (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 13, 2024, 9:13 AM IST

Gold Robbery in Hyderabad :హైదరాబాద్‌ నడిబొడ్డు దోమలగూడ ప్రాంతంలో దోపిడీ కలకలం రేపింది. కత్తులు, తుపాకులతో బెదిరించి బంగారం వ్యాపారి అతని సోదరుడు ఇళ్లలో దోపిడీ కలకలం రేపింది. సినీ ఫక్కీలో జరిగిన ఈ దోపిడీలో దుండగులు 2.5 కిలోల బంగారంతో పాటు చరవాణులు ఎత్తుకెళ్లారు.

పశ్చిమ బెంగాల్‌కు చెందిన రంజిత్‌ గోరాయి అతని సోదరుడితో కలిసి దోమలగూడలోని అరవింద్‌ కాలనీలో కుటుంబాలతో సహా నివాసముంటున్నారు. రంజిత్‌ బంగారం వ్యాపారం చేస్తున్నాడు. ఇంటి కిందనే కార్ఖానా ఏర్పాటు చేసి నగల దుకాణాలకు ఆర్డర్లపై ఆభరణాలు చేసి ఇస్తాడు. అతని సోదరుడు ఇంద్రజిత్‌ కూడా ఇదే తరహాలో చిక్కడపల్లిలో కార్ఖానా నిర్వహిస్తున్నాడు.

తుపాకీ తలపై పెట్టి : ఇంద్రజిత్‌ ప్రతిరోజు తన కార్ఖానా నుంచి రాత్రి రెండు, మూడు గంటల సమయంలో ఇంటికి వస్తుంటాడు. ఈ నెల 12న తెల్లవారుజామున 3 గంటలకు కార్ఖానా నుంచి ఇంటికి వచ్చాడు. ఇదే సమయంలో ముసుగు ధరించిన పదిమంది గుర్తు తెలియని దుండగులు బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించారు. భార్య మిత, ఇద్దరు పిల్లలను కత్తులతో బెదిరించి వారి చేతులను తాళ్లతో వెనక్కి కట్టి బంగారం ఎక్కడ దాచారో తీయమంటూ దాడి చేశారు.

ఇంద్రజిత్‌ను తీవ్రంగా కొట్టి భార్య మెడలోని బంగారు గొలుసు మూడు సెల్‌ఫోన్లు, ఐప్యాడ్‌ను లాక్కున్నారు. అనంతరం అదే ఇంటి ముందు పోర్షన్‌లో నివసిస్తున్న ఇంద్రజిత్‌ సోదరుడు రంజిత్‌ గోరాయి ఇంటికి వెళ్లారు. తలుపు తెరవకపోవడంతో ఇంద్రజిత్‌ తలపై తుపాకీ పెట్టి తలుపు తెరవపోతే అతన్ని అంతం చేస్తామని రంజిత్‌ను బెదిరించారు. దీంతో భయాందోళనకు గురై తలుపు తెరిచాడు.

షాపు యజమాని బంగారం శుద్ధి చేయమని పంపిస్తే - గుమాస్తా ఏం చేశాడో తెలుసా?

డీవీఆర్‌ను సైతం ఎత్తుకుపోయిన దుండగులు :రంజిత్‌తో పాటు కుమార్తె మెడపై కత్తులు పెట్టి లాకర్‌ తెరవమని అతని భార్యను బెదిరించారు. ఆందోళనకు గురైన ఆమె లాకర్‌ తెరిచింది. దీంతో దుండగులు లాకర్‌లో ఉన్న 2.50 కిలోల ఆభరణాలు రింజిత్‌ భార్య అనిత మెడలో ఉన్న పుస్తెలు కూడా అపహరించి కారులో అక్కడ నుంచి పరారయ్యారు. ఘటన నుంచి తేరుకున్న రంజిత్‌ కుటుంబం స్నేహితుడి సాయంతో దోమలగూడ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఘటనా స్థలానికి చేరుకున్న దోమలగూడ పోలీసులు క్లూస్‌ టీం సహాయంతో ఆధారాలు సేకరించారు. అయితే ఇంట్లోని సీసీ కెమెరాలకు సంబంధించిన డీవీఆర్‌ను సైతం ఎత్తుకుపోయినట్లు పోలీసులు గుర్తించారు. కాలనీలో ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. నిందితులు ఎత్తుకుపోయిన మొబైల్‌ ఫోన్లు పాతబస్తీలో ఉన్నట్లు గుర్తించారు. సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు.

మాస్క్​ ధరించి బంగారం దుకాణాల్లో చోరీ - చివరికి దొంగను పట్టించిన చెప్పులు!

ఆ SBI బ్యాంకులో 500 మందికి చెందిన బంగారం చోరీ - మీది ఉందో, పోయిందో చెక్ చేసుకోండి

ABOUT THE AUTHOR

...view details