Thief Slept in Wine Shop in Medak District :వైన్ షాప్‌లో దొంగతనానికి వచ్చిన ఓ దొంగ మద్యం తాగి రాత్రంతా వైన్స్‌లోనే నిద్రపోయిన ఘటన మెదక్ జిల్లా నార్సింగ్ మండల కేంద్రంలో జరిగింది. వైన్స్ షాప్ నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం నార్సింగ్ మండల కేంద్రంలో కనకదుర్గ వైన్స్‌లో చోరీకి వచ్చిన దొంగ, ఫుల్‌గా మద్యం తాగిన మత్తులో రాత్రంతా వైన్స్ షాప్‌లోనే నిద్రపోయాడు. ఈ నెల 29 రాత్రి 10 గంటలకు వైన్స్ షాప్ మూసివేసిన నిర్వాహకులు, తిరిగి ఈ నెల 30న ఉదయం తెరవగా అందులో ఇతర రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి నిద్రపోయి ఉన్నాడు.
దీంతో వైన్ షాప్ నిర్వాహకులు రామాయంపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఘటనా స్థలానికి చేరుకుని దొంగను అదుపులోకి తీసుకున్నారు. దొంగతనానికి వచ్చి మద్యం సేవించి మత్తులో నిద్రపోయి ఉండటంతో.. 108 అంబులెన్సులో రామాయంపేట ఆసుపత్రికి తరలించారు. అనంతరం వైన్స్ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు పోలీసులు దొంగపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
తాగి మత్తులో వైన్ షాప్‌లోని నిద్రపోయిన దొంగ :ఈ సందర్భంగా వైన్స్ షాప్ యజమాని పర్ష గౌడ్ మాట్లాడుతూ ఆదివారం రాత్రి వైన్స్ మూసివేసి ఇంటికి వెళ్లామని, తిరిగి సోమవారం ఉదయం షాప్ ఓపెన్ చేసి చూసేసరికి ఓ దొంగ మద్యం తాగి నిద్రపోయి ఉన్నాడని తెలిపారు. అతను వైన్ షాప్‌లోని సీసీ కెమెరాలు, హార్డ్ డిస్క్‌లు, డబ్బు, మద్యం సీసాలను సంచిలో మూట కట్టుకుని అతిగా మద్యం సేవించి.. స్పృహ కోల్పోయాడని చెప్పారు.