తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ హైవేలో వెళ్తున్నారా? - జాగ్రత్తగా లేకపోతే ప్రాణాలకే ప్రమాదం - CHALLENGES NATIONAL HIGHWAY BRIDGE

రహదారులు విస్తరించిన వంతెనలను పట్టించుకోని అధికారులు - ఎప్పుడూ ఏదో ఒక ప్రమాదం - బ్రిడ్జ్​పై నుంచి నీటిలో పడిన పదుల సంఖ్యలో వాహనాలు

NATIONAL HIGHWAY-61
వంతెన పైనుంచి వాగులో పడ్డ వాహనాన్ని తీస్తున్న క్రేన్​ (పాతచిత్రం) (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 25, 2024, 11:04 AM IST

National highway Road Accidents : మంచిర్యాల-కల్యాణి జాతీయ రహదారి-61పై తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వంతెనలు, కల్వర్టుల వద్దే ఎక్కువ జరుగుతున్నాయి. ద్విచక్రవాహనదారులు కొందరు మృత్యువాత పడగా, భారీ వాహనాలు వాగుల్లో పడిపోతున్నాయి. పలు సందర్భాల్లో డ్రైవర్లు పమాదాల నుంచి త్రుటిలో తప్పించుకుని ప్రాణాలతో బయట పడుతున్నారు. అందుకు కారణం ఇరుకు వంతెనలేనని విమర్శలు వస్తూనే ఉన్నాయి.

ఆర్‌&బీ (రోడ్లు, భవనాల) శాఖ పరిధిలోని ఈ రహదారిని 17 ఏళ్ల క్రితం జాతీయ రహదారిగా విస్తరించారు. పన్నేండేళ్ల క్రితం రూ.230 కోట్లతో మహారాష్ట్ర సరిహద్దు బెల్‌తరోడా నుంచి నిర్మల్‌ వరకు 150 అడుగుల వెడల్పుతో 54 కి.మీ. మేర రహదారిని ఉన్నతీకరించారు. కాగా వంతెనలు, కల్వర్టులను అందుకనుగుణంగా నిర్మించడం విస్మరించారు. ఇప్పటికీ చాలా చోట్ల ఆర్‌&బీ శాఖ నిర్మించిన వంతెనలే ఉన్నాయి. రహదారి విస్తరణకు అనుగుణంగా కల్వర్టులు, వంతెనలను పట్టించుకోకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటి అభివృద్ధికి అధికారులు తీసుకుంటున్న చర్యలపై ఎన్‌హెచ్‌ఏ(నెషనల్​ హైవే అథారిటీ) పీడీ శ్రీనివాస్‌రావును సంప్రదించగా ఆయన స్పందించ లేదు.

కొన్ని ఉదాహరణలు

  • భైంసా మండలంలోని మాటేగాం సమీపంలోని వంతెనపై తాజాగా శనివారం(నవంబర్​ 23) గుజరాత్‌ నుంచి విజయవాడకు టైల్స్ తీసుకెళుతున్న లారీ రక్షణ గోడను ఢీకొట్టి బోల్తా పడింది. ఇదే చోట 2023 ఆగస్టులో భైంసా నుంచి కరీంనగర్‌కు కూరగాయలు రవాణా చేస్తున్న వాహనం ఏకంగా వాగులో పడి మునిగిపోయింది. డ్రైవర్‌ తేరుకుని ఈదుకుంటూ మెల్లిగా బయటపడ్డాడు. గత ఫిబ్రవరి నెలలో ఇక్కడ ఓ టిప్పరు బ్రిడ్జి రెయిలింగ్‌ను ఢీకొని ప్రమాదానికి గురైంది.
  • ఏడాది క్రితం వానల్‌పాడ్‌ సమీపంలోని కల్వర్టును ఢీకొని షాబాద్‌ బండల లోడ్​తో ఓ లారీ వాగులో పడిపోయింది. గత ఫిబ్రవరి 20వ తేదిన మహారాష్ట్రకు సిమెంట్​ లోడ్​తో వెళ్తున్న లారీ వాగులో పడిపోయింది. డ్రైవర్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
  • కుంటాల మండలం కల్లూరు వాగుపై ఉన్న వంతెన వద్ద గతంలో లారీ, హార్వెస్టర్‌ ఢీకోగా హార్వెస్టర్‌ వంతెన రేయిలింగ్ గోడ ఎక్కి నిలిచిపోయింది. మరో ఘటనలో కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఓ డీసీఎం వ్యాన్‌ పత్తి లోడ్‌తో అదుపుతప్పి ప్రమాదానికి గురైంది.
  • నర్సాపూర్‌(జి) మండలం గుండంపల్లి సమీపంలోని ఇరుకుగా నిర్మించిన కల్వర్టు వద్ద ఏడాదిన్నర క్రితం లారీ-కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
  • భైంసా, నర్సాపూర్‌(జి), బెల్‌తరోడా, గుండంపల్లి క్రాస్‌రోడ్డు, తిమ్మాపూర్‌, వానల్‌పాడ్ సమీపంలోని కల్వర్టులు, మాటేగాం, చిట్యాల, కల్లూరు వాగులపై పాత ఇరుకు వంతెనలు ఉన్నాయి. తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతో రక్షణ గోడలు కూలిపోయాయి. ఇటీవల వాటి మరమ్మతులు చేపడుతున్నారు. కాగా కొత్త వంతెనలు నిర్మించడంలో ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వంతెనలతో పాటు రహదారిని విస్తరిస్తాం :జాతీయ రహదారి- 61పై అప్పట్లో నిర్మించిన వంతెనలే ఉన్నాయి. వాటి అభివృధ్ధికి చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే నాలుగు వరుసల రహదారిగా విస్తరించాలని ఎంపీ గోడం నగేశ్‌తో కలిసి కేంద్రప్రభుత్వానికి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశాం. సంబంధిత మంత్రిని కలిసి రహదారి, కల్వర్టులు, వంతెనల పరిస్థితిని వివరించాం.

- పి.రామారావు పటేల్, ముథోల్‌ ఎమ్మెల్యే

గుంతల రోడ్లకు గుడ్​ బై - తెలంగాణలో ఇక పల్లెపల్లెనా తారు రోడ్లు

నిర్విరామంగా కురుస్తున్న వానలకు చిత్తడవుతున్న రోడ్లు - ఇక్కట్లు పడుతున్న ప్రజలు - Roads Damaged due to Heavy Rain

ABOUT THE AUTHOR

...view details