HC Notices On Minimum Age For Class1 : ఒకటో తరగతిలో చేరేందుకు కనీస వయసు ఆరేళ్లు ఉండాలంటూ జారీ అయిన ఉత్తర్వులపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టునోటీసులు జారీ చేసింది. ఒకటో తరగతిలో చేరాలంటే కనీస వయస్సు 6 ఏళ్లు ఉండేలా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చర్యలు తీసుకోవాలంటూ కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పి.పరీక్షిత్ రెడ్డి వ్యక్తిగత హోదాలో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే జస్టిస్, జె అనిల్‌కుమార్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
విద్యావ్యవస్థ పటిష్ఠతకు పునాది దశ కీలకమైనదని, దీనికి జాతీయ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందంటూ జాతీయ విద్యా విధానం(ఎన్‌ఈపీ) ప్రకటించింది. 3 నుంచి 8 ఏళ్ల వయస్సులో మూడేళ్ల ప్రీస్కూల్, రెండేళ్ల ప్రైమరీ గ్రేడ్ తరగతులుంటాయని తెలిపింది. ప్రభుత్వం నిర్వహించే అంగన్వాడీలు, ఎన్జీవోలు నిర్వహించే సంస్థలు ప్రీస్కూల్ తరగతులుంటున్నాయి.
శిక్షణ తీసుకున్న ఉపాధ్యాయలు మొదటి తరగతి నుంచి బోధన ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ. కేంద్ర మంత్రిత్వ శాఖ గత ఏడాది ఫిబ్రవరి 9న అన్ని రాష్ట్రాలకు లేఖ రాస్తూ మొదటి తరగతికి కనీస వయస్సు 6 ఏళ్లుగా ఉండాలని నిర్దేశింది. అంతేకాకుండా రెండేళ్లపాటు ప్రీస్కూల్ విద్య భోధనకు డిప్లమో ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ కోర్సును రూపొందించడానికి అవకాశాలు ప్రయత్నించాలని సలహా ఇచ్చింది. కేంద్రం జారీ చేసిన ఈ ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ పేర్కొన్నారు.
కేంద్ర రాష్ట్రాలకు నోటీసులు జారీచేసిన హైకోర్టు :6 ఏళ్ల వయోపరిమితిని సడలించడం ద్వారా ప్రీప్రైమరీ తరగతుల్లో ప్రవేశానికి పరిమితిని సడలించేలా ఆదేశాలివ్వాలని కోరారు. అంతేగాకుండా విద్యార్థులకు సెల్‌ఫోన్ వ్యసనంగా మారుతోందని, దీనిపై శాస్త్రీయ అధ్యయనం నిర్వహించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరారు. సెల్‌ఫోన్‌ఫోన్ వ్యసనం విద్యార్థుల భౌతిక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందని, దీన్ని తగ్గించడానికి అవసరమైన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరారు. పిటిషన్‌లోని అంశాలను పరిశీలించిన ధర్మాసనం కేంద్రంతోపాటు రాష్ట్ర విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌లకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది
ఆరో తరగతి విద్యార్థిని లేఖకు స్పందించిన హైకోర్టు - బార్ & రెస్టారెంట్‌పై ప్రభుత్వానికి నోటీసులు