SIT to Probe ORR Lease Tender : హైదరాబాద్ బాహ్యవలయ రహదారి (ఓఆర్‌ఆర్) దీర్ఘకాలిక లీజు టోల్ టెండర్ల వ్యవహారంపై దర్యాప్తు దిశగా కసరత్తు మొదలైంది. టోల్ నిర్వహణ బాధ్యతను ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టడంలో ఏదో మతలబు ఉందనే కోణంలో విచారణకు రంగం సిద్ధమైంది. ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత డిసెంబరులో అసెంబ్లీలో ప్రకటించారు. ఈ క్రమంలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలోని ఓ కీలక ఉన్నతాధికారి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ఉత్తర్వులు జారీ కానున్నట్లు తెలిసింది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2023 ఏప్రిల్‌లో ఐఆర్బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనే సంస్థకు రూ.7 వేల 380 కోట్లకు ఓఆర్ఆర్ను టోల్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్ విధానంలో 30 ఏళ్లకు లీజుకిచ్చారు. అప్పటి వరకు ఓఆర్‌ఆర్ నిర్వహణతో పాటు టోల్ వసూళ్ల ప్రక్రియ హెచ్ఎండీఏ పరిధిలో ఉండగా, ఐఆర్బీ చేతికి వెళ్లింది. ఏటా టోల్ వసూళ్ల కింద సుమారు రూ.400 నుంచి రూ.450 కోట్ల ఆదాయం సమకూరుతున్న క్రమంలో తక్కువ మొత్తానికే లీజును ఖరారు చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యవహారంలో రూ.1000 కోట్లు చేతులు మారాయని అప్పట్లో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి ఆరోపించారు. అయితే నిబంధనల ప్రకారమే టెండర్ల ప్రక్రియ జరిగిందని హెచ్ఎండీఏ అప్పటి కమిషనర్ అర్వింద్ కుమార్ సమాధానమిచ్చారు.
ORR టెండర్లలో అవకతవకలు - కేటీఆర్‌పై ఏసీబీకి మరో ఫిర్యాదు
ఆ కంపెనీలను ఎవరైనా ఒత్తిడి చేశారా? : ఈ క్రమంలో సీఎం అయిన తర్వాత ఇటీవల అసెంబ్లీలో సిట్ ఏర్పాటుపై రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. సిట్ ఏర్పాటయ్యాక ప్రాథమిక దర్యాప్తు క్రమంలో ప్రధానంగా ఓఆర్‌ఆర్ టోల్ టెండర్ల ప్రక్రియపై దృష్టి సారించే అవకాశముంది. ఓఆర్ఆర్ను లీజుకు ఇచ్చేందుకు బిడ్ల దాఖలుకు హెచ్ఎండీఏ 2023 మార్చి నెలాఖరు వరకు గడువు ఇచ్చింది. బిడ్ల దాఖలుకు తొలుత 11 కంపెనీలు ఆసక్తి చూపాయి. చివరకు నాలుగే కంపెనీలు ఐఆర్బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, ఈగల్ ఇన్‌ఫ్రా ఇండియా లిమిటెడ్, దినేశ్ చంద్ర ఆర్ అగర్వాల్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, గవార్ కన్‌స్ట్రక్షన్ లిమిటెడ్‌లు పోటీపడ్డాయి. వీటిలో ఐఆర్బీ ఎల్-1గా నిలిచి బిడ్‌ను దక్కించుకుంది.
అయితే మిగిలిన కంపెనీలు ఎందుకు అనాసక్తి కనబరిచాయి? అందుకు ఎవరైనా ఒత్తిడి చేశారా? అన్న అంశంపై సిట్ ఆరా తీసే అవకాశం కనిపిస్తోంది. ఇతర రాష్ట్రాల్లోని రహదారుల లీజు ఒప్పందాల గురించీ పరిశీలించనున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా పలు జాతీయ రహదారులనూ టీవోటీ విధానంలోనే లీజుకు ఇవ్వడంతో, వాటిపైనా అధ్యయనం చేసే అవకాశం కనిపిస్తోంది. ఐఆర్బీకి లీజు అప్పగించే నాటికి టోల్ వసూళ్లు రోజుకు సుమారు రూ.కోటి 20 లక్షలు ఉండగా, ఇప్పుడు దాదాపు రూ.2 కోట్ల వరకు ఉంటున్నాయి. అప్పట్లో ఓఆర్ఆర్పై నిత్యం 1.3 లక్షల వాహనాలు రాకపోకలు సాగించేవి. ఇప్పుడు వాటి సంఖ్య పెరిగింది. ఈ లెక్కన 30 ఏళ్ల కాలంలో టోల్ వసూళ్ల ద్వారా పెద్దఎత్తున నిధులు సమకూరే అవకాశముందని, అయినా రూ.7 వేల 380 కోట్లకే బిడ్ అప్పగించడంలో మతలబేంటి? ఈ టెండర్‌తో హెచ్ఎండీఏకు ఎంత నష్టం వాటిల్లిందనే అంశాలపై సిట్ దృష్టి సారించనుంది.
ఓఆర్‌ఆర్ టోల్ టెండర్లపై విచారణ కోసం సిట్ - అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రకటన
గ్రీన్‌ఫీల్డ్ సాధ్యం కానిచోట బ్రౌన్‌ఫీల్డ్ రహదారులు - ఓఆర్‌ఆర్, ఆర్ఆర్ఆర్ల మధ్య 11 రేడియల్ గేట్లు