study certificates :ఏపీలో విజయవాడ, తెలంగాణలో ఖమ్మం వరదల తాకిడికి అల్లాడిపోయాయి. ఇటు బుడమేరు, అటు మున్నేరు ముంచెత్తడంతో కాలనీలన్నీ జలమయమైపోయాయి. వేలాది ఇళ్లను వరద చుట్టుముట్టడంతో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇంట్లో సామగ్రి అంతా వరదలో కొట్టుకుపోవడంతో కట్టుబట్టలతో మిగిలిపోయారు. ఆధార్ కార్డులు, గ్యాస్, ఎల్ఐసీ బాండ్లు, బ్యాంకు పాస్‌బుక్‌లు వరదనీటిలో తుడిచిపెట్టుకుపోయాయి. ఇదిలా ఉంటే వరద కారణంగా ఎంతో మంది విద్యార్థులు విలువైన తమ విద్యార్హత సర్టిఫికెట్లను కోల్పోయి కన్నీరుమున్నీరయ్యారు. అయితే, వారంతా సర్టిఫికెట్లను తిరిగి పొందే అవకాశాలున్నాయనే విషయం కాస్త ఊరట నిస్తోంది. వరదల కారణంగా సర్టిఫికెట్లు కోల్పోయిన విద్యార్థులందరికీ తిరిగి ఉచితంగా సర్టిఫైడ్ కాపీలు, డూప్లికేట్ సర్టిఫికెట్లను అందిస్తామని ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యామండలి వెల్లడించింది.
వరదల కారణంగా ముంపు ప్రాంతాల్లో సర్టిఫికెట్లు పోగొట్టుకున్న విద్యార్థులకు డూప్లికేట్ సర్టిఫికెట్లను ఉచితంగా అందించాలని ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. విజయవాడ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వరద ముంపులో సర్టిఫికెట్లు కోల్పోయిన వారికి ఎలాంటి ఫీజు లేకుండా ఉచితంగా తిరిగి ఇవ్వనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది.
దరఖాస్తు చేయడమెలాగో తెలుసా?
నష్టపోయిన విద్యార్థులకు ఉచితంగా సర్టిఫైడ్ పత్రాలతో పాటు డూప్లికేట్ సర్టిఫికెట్లను అందించాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా వెల్లడించారు. ఇదే విషయాన్ని ఆర్‌ఐవోలు, డీఐఈవోలు వరద ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా ప్రచారం ఆమె సూచించారు. బాధిత విద్యార్థులంతా సర్టిఫికెట్ల కాపీల కోసం కళాశాలలో, జిల్లా అధికారులను, లేదా నేరుగా బోర్డు అధికారులను సంప్రదించవచ్చని సూచించారు. వారందరికీ ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉచితంగా సర్టిఫికెట్లు ఇవ్వనున్నట్లు ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.
విద్యార్థుల సర్టిఫికెట్ల అంశంపై మంత్రి నారా లోకేశ్ ఇటీవల విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజా సమస్యలపై ప్రజా దర్బార్ నిర్వహిస్తున్న ఆయన.. తన దృష్టికి వచ్చిన సర్టిఫికెట్ల సమస్యపై వెంటనే స్పందించారు. సర్టిఫికెట్లు జారీ చేసేలా వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు. అంతేగాకుండా భవిష్యత్తులో విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం యూనివర్సిటీలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పూర్తిస్థాయిలో డిజిటల్ లాకర్స్ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. మున్ముందు ఏపీపీఎస్సీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కూడా సులభతరమయ్యేలా డిజి లాకర్స్‌ను ఏఐతో అనుసంధానించాలని సూచించారు. తద్వారా సులభంగా సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేయొచ్చని మంత్రి లోకేశ్ వెల్లడించారు.
బడులను ముంచిన బుడమేరు - శుభ్రం చేసే పనిలో సిబ్బంది - govt schools damaged floods
బుడమేరు కన్నీరు - సర్వం తుడిచి పెట్టేసిందని ఘొల్లుమంటున్న బాధితులు - Home Appliances damage