MBBS Students Sai Shradda Issue : ఆమె ఒక నిరుపేద ఆదివాసీ కుటుంబంలో జన్మించిన అమ్మాయి. ప్రజలకు సేవలందించే డాక్టరు కావాలనే ఆశయంతో కష్టపడి చదివింది. జీవితంలో పెట్టుకున్న దిశగా లక్ష్యాన్ని సాధించింది. తల్లిదండ్రుల కళ్లల్లో ఆనంద భాష్పాలతో సంతోషం వెల్లివిరిసింది. కానీ అంతలోనే కన్నీటి ధార సైతం మొదలైంది. తమ కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందులు ఏళ్లుగా వేధిస్తూనే ఉన్నాయి. ఆ తల్లిదండ్రులకు తమ బిడ్డ గమ్యానికి ఆర్థిక పరిస్థితి ఎక్కడ అవరోధంగా మారతుందోనని ఆందోళనతో కంటిమీద కునుకు కరవైంది.
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం జెండాగూడ గ్రామానికి చెందిన మెస్రం జ్ఞానేశ్వర్, లక్ష్మి దంపతులకు శుభం (కుమారుడు), సాయిశ్రద్ధ (కుమార్తె) సంతానం. వీరికి సొంతిల్లు కూడా లేదు. జ్ఞానేశ్వర్ టైలర్‌గా పని చేస్తున్నారు. కుమారుడు శుభం బీటెక్ చదివి గేట్ పరీక్షకు సన్నద్ధమవుతున్నాడు. కుమార్తె సాయిశ్రద్ధ నార్నూర్ మండలంలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో పదో తరగతి వరకు చదివింది.
మంచిర్యాల కళాశాలలో సీటు : ప్రభుత్వ కార్పొరేట్ పథకం సాయంతో వరంగల్‌లో ఇంటర్ పూర్తి చేసింది. ఎలాగైనా డాక్టరు కావాలనే లక్ష్యంతో పట్టుదలగా చదివి నీట్‌లో ఎస్టీ రిజర్వేషన్ విభాగంలో 103వ ర్యాంకు సాధించింది. కౌన్సెలింగ్‌లో మంచిర్యాల ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌లో సీటు పొంది, తన కలను సాకారం చేసుకుంది. అయితే కళాశాల ప్రవేశ ఫీజు, ట్యూషన్, గ్రంథాలయ రుసుంలు, పాఠ్యపుస్తకాలు, రాత పుస్తకాలకు కలిపి దాదాపు రూ.1 లక్ష 30 వేలు అవసరమవుతున్నాయి. అంత పెద్దమొత్తంలో ఖర్చులు భరించలేమని, సీటు చేజారిపోతుందేమోనని ఆ కుటుంబం అల్లాడుతోంది. ఎవరైనా దాతలు సహృదయంతో ఆదుకోవాలని, తమ బిడ్డ గొప్ప డాక్టర్ అయ్యేలా సహకరించాలని, మనసున్న వారు 8096343001 నంబరుకు సాయం చేయాలని జ్ఞానేశ్వర్ దంపతులు వేడుకుంటున్నారు.